23-02-2026 12:16:11 AM
నామినేటెడ్ పదవులపై చిగురిస్తున్న ఆశలు
కరీంనగర్, ఫిబ్రవరి 22 (విజయ క్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు చిగురించాయి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులకు ఈసారైనా అవకాశం దక్కుతుందా చూడాలి. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ అసెంబ్లీ తోపాటు జగిత్యాల, కోరుట్లలో పార్టీ నేతల్లో ఆధిపత్య పోరు నెలకొనడంతో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న ఇక్కడి నేతలకు పదవుల కోసం ఎవరిని కలవాలో తెలియక అందరి వద్దకు పరుగులు తీస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీ అధికారంలో లేనప్పుడు జెండాలు మోసినవారు ఈ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలోనే క్షేత్రస్థాయిలో కార్యకర్తల కష్టనష్టాలను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తెలుసుకున్నారు. మీనాక్షి నటరాజన్ అందించిన సిఫారసులకు ఫలితం దక్కుతుందన్న ఆశలో శ్రేణులు ఉన్నారు. జిల్లాల వారీగా అందించిన జాబితాలలో 30 నుంచి 40 పేర్లు ఉన్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్, సిరిసిల్ల మినహా మిగతా చోట్ల ఆశించిన ఫలితాలు దక్కడంతో యువత, సామాజిక వర్గాల వారీగా గణన చేసి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉగాది నాటికి ఈ పదవుల భర్తీ ఉంటుందని ఆశిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి, రామగుండం,
పెద్దపల్లి, మానకొండూర్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, మక్కాన్ సింగ్, చింతకుంట విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణల తోపాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లు తమ వారి కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. జగిత్యాల విషయంలో సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి నడుస్తుండడంతో అక్కడివారిలో ఎవరికి పదవులు దక్కుతాయో వేచి చూడాలి. అలాగే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వర్గాలు ఉండడంతో ఇక్కడ బాధ్యత మంత్రులు తీసుకునే అవకాశం ఉంది. హుజూరాబాద్లో అక్కడి ఇంచార్జి ప్రణవ్ బాబు, కోరుట్లలో నర్సింగరావులు తమ వారికి పదవులు ఇప్పించుకోవాలని చూస్తున్నారు.
కాంగ్రెస్లో ఉన్న వర్గ పోరుతో రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఆశించిన స్థాయిలో దక్కుతుందా లేదా అన్నది చూడాలి. గతంలో మహిళా కమిషన్ చైర్మన్ గా నియమితులైన నేరెళ్ల శారద పదవీకాలం ముగిసింది. తిరిగి ఆమెకు అవకాశం దక్కుతుందా చూడాలి. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పదవీ కాలం మరోసారి పొడగించే అవకాశాలున్నాయి. రాష్ట్రస్థాయితో పాటు జిల్లాస్థాయిలో కీలకమైన ఆలయాలు, ఇతర నామినేటెడ్ దవుల భర్తీపై ఆశలు పెంచుకున్నారు. మార్కెట్ కమిటీల పాలకవర్గాలు పలుచోట్ల ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా భర్తీ చేయాలని కార్యకర్తలు పట్టుబడుతున్నారు.