పీవోకే మనదవుతుందా?
ఖచ్చితంగా ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ (పీవోకే) మనదే. ఈ విషయంలో ఎటువంటి బేషాజాలు పనికి రావు. మనం పీవోకే అని పిలుచుకుంటే వాళ్ళు (పాక్) మాత్రం ‘అజాద్ కాశ్మీర్’ అంటున్నారు. ఉగ్రవాదం పెంచి పోషించిందే పాక్. అనేకమంది ఉగ్రవాదులు హతమైనా పాక్‌లో మార్పు లేదు. “ఉగ్రవాదం మూలాలు ఆ దేశంలోనే ఉన్నాయి” అని ప్రపంచ దేశాలు కోడై కూస్తున్నా పాక్‌లో చలనం లేదు. ‘మేము కూడ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వం’ అని ఓ ప్రకటన చేస్తుంది, అంతే. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచి వేసేది భారతే. మోదీది బలమైన ప్రభుత్వం. ‘ఉగ్రవాద నిర్మూలనే మా లక్ష్యం’ అని ఎన్నోమార్లు పేర్కొన్నారు.
ఇటీవల అమిత్ షా పలు సందర్భాలలో బీజేపీ ఈసారి తిరిగి అధికారంలోకి వస్తే ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ను హస్తగతం చేసుకుంటామని చెప్పుకొచ్చా రు. ఈ విషయంలో పాకిస్థాన్ స్పందించినట్టు లేదు. కారణం, పీవోకేలో ఆ దేశానికి వ్యతిరేక పరిస్థితులు వుండడమే అని విశ్లేషకులు అంటున్నారు. పీవోకేలోని ప్రజలు భారత్‌పట్ల అనుకూలంగా ఉన్నట్లు అర్థమవుతున్నది. ఎందుకంటే, నిత్యం ఆ దేశంలో అలజడి, ఉగ్రచర్యలు, అస్థిరత, సంక్షోభం నెలకొని ఉండటమే కారణంగా పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీవోకే ప్రజలలో భారతదేశానికి అనుకూలమైన మార్పు వచ్చినట్టుంది. వారు భారత్ లోనే ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, పీవోకేను భారత్‌లో కలిపేసుకోవడం అన్నది సరైన చర్య కాదని వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. బీజేపీ మాత్రం ఖచ్చితంగా పాక్ ఆక్ర మిత కాశ్మీర్ మనదే అంటున్నది.
గతంలో ఈ మాట అన్నప్పుడు పాక్ నాయకులు ‘అది మాదే’ అని చెప్పడం, “కాశ్మీర్ కోసం వేయి సంవత్సరాల యుద్ధం చేస్తాం” అంటూ భావోద్వేగ ప్రకటనలు చేయడం గమనార్హం. ఇప్పుడు అమిత్ షా ప్రకటనలకు పాక్ స్పందించటం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చి, కొత్త ప్రభుత్వం వస్తే కానీ, ఏం జరుగుతుందో తెలియదు, వేచి చూడాల్సిందే.
-కనుమ ఎల్లారెడ్డి






