ఉత్తమ గుణాల సాధన
‘ఒక వ్యక్తి నేర్చిన విద్య ఆతడు చేసిన అభ్యాసం వల్ల తెలుస్తుంది. ఆతని శీల నిర్మాణం వల్ల అతని కులం నిర్ధారణవుతుంది. ఆతని శ్రేష్ఠత్వం తన గుణగణాలతో వెల్లడవుతుంది. అతని కోపం అతని కన్నులలో కనిపిస్తుంది’ అంటారు ఆచార్య చాణక్య. ఈ శ్లోకంలో ఆచా ర్య చాణక్యుడు నాలుగు అంశాలను ప్రతిపాదించారు. మొదటిది విద్య, రెండవది శీల నిర్మాణం, మూడవది శ్రేష్ఠత్వం, కాగా నాలుగవది కోపం. అలాగే, వాటిని వ్యక్తం చేసినప్పుడు ఆ వ్యక్తికి కలిగే గుర్తింపు.
విద్య అనేది అక్షరాస్యత కాదు. సత్ అసత్‌ల మధ్య భేదాన్ని గుర్తించి సత్‌వైపు నడిపేది విద్య. ఏది తెలుసుకోవడం వల్ల సమగ్ర వ్యక్తిత్వ వికాసన కలుగు తుందో, దేనివల్ల ప్రేయస్సు (భౌతిక జీవితంలో ప్రగతి), దేనివల్ల శ్రేయస్సు (ఆధ్యాత్మిక జీవితంలో సుగతి) కలుగుతుందో దానిని అందించేది విద్య. అది ఒకరోజు నేర్చుకొని విడిచి పెట్టేది కాదు. నిరంతర అభ్యాసం కావాలి. ఒకసారి చదివిన అంశాన్ని మరొకమారు చదివిన సమయంలో మన అవగాహనలో మార్పు కనిపిస్తుంది. ఎంత ఎక్కువగా లోతుగా వివిధ కోణాలలో అధ్యయనం చేస్తే అంత విస్తృతి కలుగుతుంది. విద్యవల్ల వినయం, వివేచన, గౌరవం లభిస్తాయి. అందుకే, ఒక వ్యక్తి విద్యాస్థాయి అతని అభ్యాసంపై ఆధారపడి ఉంటుందని చాణక్యుడు అన్నారు. నిరంతర అభ్యాసంతో నైపుణ్యం పెరుగుతుంది. చేసే పనిలో సృజనాత్మక వైఖరి విస్తరిస్తుంది. అలాంటి విద్యను నిరంతర అభ్యాసం చేయాలి.
త్రికరణ శుద్ధిగా జీవితాన్ని నిర్వహించుకోవడం మానవ జీవన విధి. మనసా వాచా కర్మణా సత్యాన్ని సాధన చేయడం, ఇచ్చిన మాటపై కట్టుబడి వుండడం, సేవా భావన, చేసే పనిలో నిబద్ధత, ధర్మమార్గ నడవడిక, ఉన్న సంపదలను పదుగురితో పంచుకోవడం, తనది కాని దానిని ఆశించక పోవడం, సుఖాలకు పొంగిపోవడం, కష్టాలకు క్రుంగిపోవడం వంటి చంచలత లేకపోవడం వంటివి శీలానికి ప్రాతిపదికలు. ఇలాంటి గుణాలతో జీవితాన్ని (బతుకును కాదు) సాగించడమే సత్‌శీలాన్ని కలిగి వుండడమన్నమాట.
శీలమే సర్వస్వం
మన పురాణాలలో ఒక కథ ఉంది. ఒకప్పుడు త్రిలోకాధిపత్యాన్ని సాధించిన బలివద్దకు ఇంద్రుడు వెళ్లాడు. బలి శీలాన్ని దానంగా కోరాడు. అడిగిన దానిని ఇచ్చే స్వభావం కలిగిన బలి తనవద్ద నున్న శీలాన్ని దానం చేస్తున్నానన్నాడు. దాంతో అతనిలో నుండి ఒక తేజస్సు బయటికి వచ్చింది. “నీవెవరు? ఎందుకు నన్ను వీడి వెళుతున్నావు?” అని ఆ తేజస్సును అడిగాడు బలి. దానికి ఆ తేజస్సు, “నేను నీవు దానం చేసిన శీలాన్ని. దానం చేశావు కాబట్టి నీ నుండి వెళ్ళిపోతున్నాను” అన్నది. సరేనన్నాడు బలి.
వెంటనే మరొక తేజస్సు తాను ధర్మాన్నని, శీలం లేని చోట తానుండ లేనని చెప్పి వెళ్ళిపోయింది. అలాగే, సత్యం, శౌచం, బలం, వీర్యం అన్నీ వరుసగా ఒకదాని వెనుక ఒకటి వెళ్ళిపోయాయి. ఆ పిదప, ఆతణ్ణి ఆశ్రయించిన లక్ష్మీదేవికూడా ఆతనిని వీడిపోయింది. దాంతో బలి చక్రవర్తి తేజోహీనుడు, నిర్వీర్యుడు అయ్యాడు. తదుపరి బలి విష్ణువును ప్రార్థించి, తిరిగి ఆయన ద్వారా తను కోల్పోయిన శీలాన్ని పొందడం జరుగుతుందన్నది కథనం. అలా, మిగిలిన గుణాలన్నీ వచ్చేశాయి. మానవ జీవిత నిర్వహణలో సమాజంతో మన ప్రవర్తన, మనల్ని మనం ఉద్ధరించుకునే విధానంలో మన వైఖరిని శీలంగా చెప్పాలి. దానితో మన కులం తెలుస్తుంది. కులం అంటే ఈనాటి సమాజంలోని అసమానత్వం కాదు, జాతి లేదా స్థాయి. శీల నిర్మాణం వల్ల జాత్యంతరీకరణ జరుగుతుంది. ఉన్నస్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగడం అన్నమాట.
గుణం వల్ల వ్యక్తి శ్రేష్ఠత తెలుస్తుంది. విషయ పరిజ్ఞానం, అనుభవజ్ఞానం ఈ రెంటి కలయికయే శ్రేష్ఠత. విషయం తెలియడమూ దానిని ఆచరణలో పెట్టి ఫలితాలను విశ్లేషించుకొని మంచిని గ్రహించడమూ శ్రేష్ఠతా సాధనగా చెప్పాలి. దీనిలో సరళత, సమగ్రత, సంయమనత, పరిశుద్ధత, ఏకాగ్రత, స్పష్టత, ఔచిత్యం,నిర్దుష్టత, నాణ్యత, సమయపాలన, విశ్వసనీయత, శ్రద్ధ వంటి అంశాలు కీలకం అవుతాయి. శ్రేష్ఠతా సాధనవల్ల వివేకం పెరుగుతుంది. వివేకంతో చేసే పనిలో సాఫల్యత సిద్ధిస్తుంది. ‘అనుభవ రహితమైన జ్ఞానం కన్నా జ్ఞానరహితమైన అనుభవం ఆదరణీయం’ అంటారు పెద్దలు. గుణం మనం అభివ్యక్తీకరించే వైఖరికి ప్రతిబింబమే. అది ఎంత నిర్మలమైతే శ్రేష్ఠత అంతగా భాసిస్తుంది.
ఆయా సన్నివేశాలకు వ్యక్తి స్పందించే భావోద్వేగాలలో కోపం ఒకటి. సంఘటన మనకు ఇష్టం కానప్పు డు మనలో కలిగే నకారాత్మక స్పందన. ఇది ప్రతిక్రియ. సందర్భం అనుగుణంగా ఉన్నప్పుడు వ్యక్తి స్పందించే విధానం అనుక్రియ. కోపం వల్ల నకారాత్మకమైన ఫలితాలు వస్తాయి. “దాచుకోలేని కోపం ముందుగా వ్యక్తమయ్యేది వ్యక్తి కళ్లలో” అంటారు ఆచార్య చాణక్య. మన పురోగతిలో ఉపయుక్తమయ్యే వాటిని స్వీకరించి అనవసరమైన వాటిని విసర్జించడం ద్వారా వ్యక్తి ఉన్నతుడవుతాడు.






