12-02-2026 02:35:01 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): తమది ప్రజాప్రభుత్వమని చెప్పుకొంటున్న కాంగ్రెస్ సర్కార్.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న జర్నలిస్టులకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నట్లు కనిపిస్తు న్నది. జర్నలిస్టులకు అందజేసే అక్రిడిటేషన్ కార్డుల జారీకి సర్కార్ పెట్టిన కొర్రీలే అందుకు నిదర్శనం. సర్కార్ మార్గదర్శకాలు నాలుగైదు పెద్ద పత్రికలు, పెద్ద న్యూస్ చానెళ్లకు అనుకూలంగా ఉన్నాయే తప్ప.. చిన్న పత్రికలకు మేలు చేసే విధంగా లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెద్ద పత్రికల యాజమాన్యాల మెప్పు పొందేందుకు, సర్కార్ చిన్న పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియా సంస్థల మెప్పు పొందేందుకే సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మంగళవా రం హైదరాబాద్‌లోని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పలువురు జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. మార్గదర్శకాలను సవరించాలని డిమాండ్ చేశారు. చిన్నాపెద్ద ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల పరిధిలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికిపైగా జర్నలిస్టులు పనిచేస్తున్నారు.
ఈ గణాంకాలు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్‌పీఆర్) అంచనానే. వారందరికీ ప్రస్తుతం అక్రిడిటేషన్‌కార్డులు అందాల్సి ఉంది. కొత్త మార్గదర్శకాల వల్ల వారిలో సగమందికైనా కార్డులు అందే అవకాశం లేనట్లు తెలుస్తున్నది. గతేడాది డిసెంబర్ 22న జారీ చేసిన జీవో నంబర్ 252 మాత్రం పెద్ద పత్రికలు, పెద్ద న్యూస్ చానెళ్లు యాజమాన్యాలకు మేలు చేసే విధంగానే ఉందని జర్నలిస్టు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
చిన్న తరహా, మధ్య తరహా పత్రికలు, మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందకుండా సర్కార్ అందకుండా చూస్తోందని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇటీవల సవరించిన (అమెండ్‌మెంట్) జీవోలోనూ చిన్న మీడియా సంస్థల జర్నలిస్టులకు అన్యాయం చేసే విధంగానే ఉందని అభ్యంతరాలు తెలుపుతున్నాయి. పెద్ద పత్రికల్లో మాదిరిగానే , చిన్న పత్రికల్లోనూ సినిమా, క్రీడలు, కల్చరర్ రిపోర్టర్లు ఉంటారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో, వారికి అక్రిడిటేషన్ కార్డులిచ్చే వెసులుబాటు లేకపోవడాన్ని తప్పుపడుతున్నాయి.
పత్రికా రంగంలోనైతే పెద్ద, మధ్య తరహా పత్రికలకు (సర్క్యూలేషన్ ఆధారంగా) భారీస్థాయిలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో అక్రిడిటేషన్ కార్డులు వచ్చేలా మార్గదర్శకాలున్నాయని వాదిస్తున్నాయి. చిన్న పత్రికా సంస్థలకు మాత్రం మొండిచేయి చూపించే విధంగా మార్గదర్శకాలున్నాయని ఆరోపిస్తున్నాయి. జర్నలిజం రంగంలో 20 25 ఏండ్ల అనుభవం ఉన్న వారికీ కూడా కార్డు అందని పరిస్థితులున్నాయని వాపోతున్నాయి.
జర్నలిస్టులూ.. ప్రజలే
జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మ ధ్య వారధిలా పనిచేస్తారు. అయినప్పటికీ వారు ప్రజల నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఏదీ ఆశించరు. యాజమాన్యాలు ఇచ్చే అరకొర జీతాలతోనే బతుకుబడిని నెట్టుకువస్తారు. ఒక ప్రైవేటు ఉద్యోగికీ, జర్నలిస్టుకు పెద్ద తేడా ఏమీ ఉండదు. కానీ, ప్రత్యేకతను తీసుకువచ్చే ఒక సాధనం అక్రిడిటేషన్ కార్డు మాత్రమే. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది, వాటిపై అవగాహన కల్పించేది, వారి సమస్యలను ప్రభుత్వం వర కూ తీసుకెళ్లేదీ.. జర్నలిస్టులే.
ఉద్యోగాన్ని కేవ లం భుక్తికోసం కాకుండా, సామాజిక బాధ్యతగా భావించి చేసే కొలువు జర్నలిజం. అలాంటి వృత్తిలో ఉన్నవారికి సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రభుత్వపరమైన ఆరో గ్య బీమా వర్తించాలన్నా, ఇండ్ల స్థలాల కేటాయింపు జరగాలన్నా అక్రిడిటేషన్ కార్డే గీటు రాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తో ఇండ్ల స్థలాల కేటాయింపు ఆశలు అడియాశలు అయ్యాయి. మరోవైపు జర్నలిస్టుల కు ఇండ్ల స్థలాలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. సీఎంతో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలు కూడా ఆ అంశంపై సానుకూలంగా నే ఉన్నట్లుకనిపిస్తున్నది.
ఈతరుణంలో అక్రిడిటేషన్ కార్డు వస్తుందో.. రాదో అన్న ఆందో ళన జర్నలిస్టుల్లో ఉంది. అదొక్కటే కాదు.. ఒక జర్నలిస్టు వృత్తిపరమైన అవసరాల కో సం ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలన్నా, అధికారిని కలవాలన్నా.. అక్రిడిటేషన్ కార్డే ఒక రకమైన ఎంట్రీ పాస్. అలాంటి అక్రిడిటేషన్ కార్డు విషయంలో సర్కార్ సంకుచితమైన మార్గదర్శకాలు జారీ చేయడంపై జర్నలిస్టులు పెదవివిరుస్తున్నారు.
కొత్త పత్రికల మాటేంటి?
పెద్ద పత్రికల మాట అటుంచితే.. మీడియా రంగమన్నాక.. ఎప్పటికప్పుడు కొత్త పత్రికలు పుట్టుకొస్తూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు, ఆయా సంస్థలను ప్రోత్సహించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ, రాష్ట్రప్రభుత్వం రెండు, మూడేళ్ల నుంచి నడుస్తున్న మీడియా సంస్థలకు అక్రిడిటేషన్ కార్డులేవు.. అనే విధంగా మార్గదర్శకాలు రూపొందించడం ఎంతవరకు సబబు? 2016 మార్గదర్శకాల ప్రకారం.. ఒక పత్రికకు ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ (ఏబీసీ) సర్టిఫికెట్, ఐఆర్‌ఎస్ సర్టిఫికెట్ ఉండాలి.
అలాగే.. మూడేండ్ల క్రితం ప్రారంభించిన పత్రికలు, మీడియా సంస్థల విషయంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) సర్టిఫికెట్‌ను సర్కార్ పరిశీలించవచ్చనే మార్గదర్శకాలున్నాయి. కానీ, గతేడాది డిసెంబర్ జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ నిబంధన ఎత్తివేశారు. దీంతో ‘విజయక్రాంతి’, ‘తెలుగు ప్రభ’ వంటి పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌కార్డులు అందని పరిస్థితి నెలకొంది. పోనియ్.. ఇప్పటికిప్పుడు యాజమాన్యాలు పీఆర్‌జీఐ, ఆర్‌ఎన్‌ఐ సర్టిఫికెట్లు పొందే అవకాశమూ లేకపోయింది. ఎలా చూసినా.. ఆ సర్టిఫికెట్లు సాధించాలంటే.. మే, జూన్ వరకు ఆగాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంగతేంటి?
ఇవేం నిబంధనలు?
75,001 కంటే ఎక్కువ సర్క్యూలేషన్ ఉన్న పత్రికలను పెద్ద పత్రికలుగా, 25,001 నుంచి 75,000 వరకు సర్క్యులేషన్ ఉన్న పత్రికలను మధ్యస్థ పత్రికలుగా, 2,000 నుంచి 25,000 సర్క్యులేషన్ ఉన్న పత్రికలని సర్కార్ జీవో నిర్వచిస్తున్నది. ఇంత వరకూ ఓకే అనుకున్నా.. మరి అనుబంధం (అనేగ్జర్‌ొోఎ)లో 2.5 లక్షల సర్క్యులేషన్‌కు పైగా ఉన్న యాజమాన్యాలకు ఎక్కువ సంఖ్యలో అక్రిడిటేషన్ కార్డులు కట్టబెట్టే వెసులుబాటు తీసుకురావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే.. జీవోలో లేని విధంగా 15,001 నుంచి 25,000 సర్క్యూలేషన్..
అనే కొత్త కేటగిరీని తీసుకొచ్చి.. రాష్ట్రస్థాయిలో ఒక జర్నలిస్టుకు, ఒక ఫొటోగ్రాఫర్‌కు మాత్రమే అక్రిడిటేషన్‌కార్డు అందేలా మార్గదర్శకాలు రూపొందించడమేంటి? రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. పత్రికల సర్క్యూలేషన్ కేటగిరీగా కాకుండా, జర్నలిస్టు వృత్తిలోనే కొనసాగుతున్నవారందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని జర్నలిస్టులు, ఆయా జర్నలిస్టు సంఘాలు విజ్ఞప్తిచేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే కొన్ని జర్నలిస్టు సంఘాలు న్యాయపరంగా వెళ్లే పరిస్థితి ఉందనే కూడా ఇప్పుడు చర్చ మొదలైంది.