12 March, 2026 | 8:21 AM

వైద్యం వికటించి మహిళ మృతి

12-03-2026 01:20 AM

వనస్థలిపురం పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో దారుణం

ఎల్బీనగర్, మార్చి 11: ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందిన ఘటన బుధవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గర్భసంచిలోని కణ తులను తొలిగించేందుకు నిర్వహించిన ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుద్వార్ రోడ్డులోని హయగ్రీవ మల్టీ స్పెషాలిటీ దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మధనపురం గ్రామానికి చెందిన వల్లపు రాణి (40), భర్త వెంకటాద్రి, కుమారుడు, కుమార్తెతో కలిసి  వనస్థలిపురంలోని కమలానగర్ కాలనీలో ఉంటుంది. భర్త ఏడేళ్ల క్రితం మృతి చెందగా,  రైతు బజార్‌లో కూరగాయలు విక్రయిస్తూ పిల్లలను చదివిస్తున్నది. రాణి కొంతకాలంగా గర్భసంచి సమస్యతో బాధపడుతూ సోమవారం గురుద్వార్ రోడ్డులోని హయాగ్రీవ మల్టీ స్పెషాలి టీ ఆస్పత్రిలో చేరింది. పరిశీలించిన వైద్యులు గర్భసంచిలోని కణితులను తొలగించాలని నిర్ణయించి మంగళవారం సర్జరీ చేశారు.

బుధవారం  మహిళను లిఫ్టులో ఎలాంటి స్ట్రెచర్ లేకుండా నిలబెట్టి తీసుకువస్తుండగా.. లిఫ్టులోనే కుప్పకూలిపోయింది. ఐసీయూలో చికిత్స అందిస్తుండగానే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాగా, రాణి చనిపోలేదని... మెరుగైన చికిత్స కోసం  దవాఖానకు తరలిస్తున్నట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. రాణిని పరిశీలించిన  వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ని ర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే రాణి మృతి  చెందినట్లు బంధువు ఆరోపించారు. కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు  సీఐ మహేశ్ తెలిపారు.