10 March, 2026 | 9:54 PM

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి

10-03-2026 08:03 PM

జిల్లా  కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మహిళలు విద్య, ఉపాధి, సామాజిక సేవ తదితర అన్ని రంగాలలో ముందుకు వచ్చి సమాజానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి తమ ప్రతిభను అన్ని రంగాల్లో చాటాలన్నారు. ప్రతి మహిళ ఇతర మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాలని, ఆరోగ్యంగా ఉన్న మహిళలతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.

సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులను అలంకరించి దేశాలకు సేవలందిస్తున్నారని తెలిపారు. వారి స్ఫూర్తితో ప్రతి మహిళ కూడా విద్య, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరియు సామాజికంగా ఎదగాలని సూచించారు. మహిళల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకోవాలని తెలిపారు.అనంతరం నిర్వహించిన సిగ్నేచర్ క్యాంపెయిన్‌లో కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు సంతకాలు చేశారు.

ఆకట్టుకున్న నృత్యాలు... మంచిర్యాలకు చెందిన నందిని నృత్య నిలయం విద్యార్థినులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అలాగే సన్నీ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీకి చెందిన చిన్నారులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, జి.సి.డి.ఓ శకుంతల, మహిళా సాధికారత సంఘ సభ్యులు శారద, రాణి, రాజేశ్వరి, మమతతో పాటు వివిధ శాఖల అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.