- ఆసుపత్రులు, విద్యాసంస్థలను తనిఖీ చేయండి
- అధికారులకు మంత్రులు దామోదర, జూపల్లి సూచన
- ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష
మహబూబ్‌నగర్, జూలై 7 (విజయక్రాంతి): ప్రజల సంక్షేమమే పరమావధిగా అధికారులు కంకణబద్దులై పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జనరల్ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఉమ్మడి జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దామోదర రాజనరసింహ మాట్లాడారు. ఆస్పత్రులను, విద్యాసంస్థలను కలెక్టర్లు తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఎంతో అవకాశం ఉన్నదన్నారు. ఈ నెల 9న ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఉన్న సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా చర్చించారు.
2004 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ల పనుల్లో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాలోని 19 నియోజకవర్గాలు, 71 మండలా ల్లోని 12లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు, పారిశ్రామిక సంస్థలకు నీటి సరఫరాకు హైదరాబాద్‌నగరంతో సహా 1,226 గ్రామలకు నీటి సరఫరాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించినట్లు తెలిపారు. పర్యావరణ అనుమతులతో పాటు ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారు.
పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్, వట్టెం, కర్వేనా, ఎదుల రిజర్వాయర్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు 60 శాతం పూర్తయినట్లు తెలిపారు. ఉద్దండపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి ఆర్ అండ్‌ఆర్ పూర్తి చేయాలని సమావేశంలో ఎమ్మెల్యేలు కోరారు. కాగా ప్రాజెక్టు ప్రతిపాదిత వ్యయం రూ.35,200 కోట్ల నుంచి రూ.55వేల కోట్లకు పెరిగిందని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తెలిపారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను కూడా పూర్తి చేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే కోరారు. ప్రాజెక్టులకు సంబంధించి చేయాల్సిన పనులు, ప్రతిపాదిత వ్యయం బడ్జెట్ గురించి నివేదిక రూపొందించాలని సమావేశంలో పాల్గొన్న ఎంపీ మల్లు రవి, పలువురు ప్రజాప్రతినిధులు సూచించారు. అదే విధంగా ప్రతీ నియోజకవర్గంలో స్టోరేజీకి 4, 5 టీఎంసీల రిజర్వాయర్‌లు నిర్మించాలని సూచించారు.
పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేయాలని, ఆస్పత్రుల్లో మౌళిక వసతులు కల్పించాలని కోరారు. అన్ని విద్యాసంస్థల్లో అన్ని వసతులు కల్పించాలని కోరారు. సమావేశంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఈర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, మధుసూదన్‌రెడ్డి, అనిరుద్‌రెడ్డి, పర్ణికరెడ్డి, వంశీకృష్ణ, మేఘారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, సాగునీటి శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి, నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోస్, వనపర్తి ఇన్‌చార్జి కలెక్టర్ సంజిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు, మయాంక్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్‌నగ ర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయిలతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ.. ఈ ఏడాది చివరిలోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని మెడికల్ కళాశాలల్లో అన్ని వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పీ హెచ్‌సీ, సబ్ సెంటర్స్, ఏరియా ఆస్పత్రు లు, భోధన అస్పత్రుల్లో అన్ని సౌకర్యలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9న సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. ఆయనవెంట ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఎస్పీ జానకి ఉన్నారు.