1 May, 2026 | 8:41 PM

మేడే స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి

01-05-2026 07:21 PM

ఎరవెల్లి ముత్యంరావు, తాండ్ర అంజయ్య

సుల్తానాబాద్,(విజయక్రాంతి): 140వ మేడేను పురస్కరించుకొని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కార్మికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు, అనంతరం రైస్ మిల్లు ఓనర్ అసోసియేషన్ వద్ద జెండాలను ఆవిష్కరించి, సభ నిర్వహించారు.  ఇందులో ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, సుల్తానాబాద్ మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య లు మాట్లాడుతూ... 140 సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పని దినం కోసం జరిగిన పోరాటం ఆధారంగా నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అనేక పోరాటాలు, ఉద్యమాలు, నిర్వహించి హక్కులు, సౌకర్యాలు, చట్టాలు సాధించుకున్నదని అన్నారు.

కానీ నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పోరేట్, మతోన్మాద విధానాల మూలంగా కార్మిక వర్గం కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నదని అన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ ను తెచ్చి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే వ్యవస్థను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని, దానికి ప్రతిఘటనగా భారత కార్మిక వర్గం అనేక సమరశీల సమ్మెలు, పోరాటాలు నిర్వహించిందని అన్నారు.  రాబోయే రోజుల్లో సమరశీల పోరాటాలకు కార్మిక వర్గం సన్నద్ధం కావలసిన అవసరం ఉందని, అదే చికాగో అమరవీరులకు అర్పించే నిజమైన నివాళులని పిలుపునిచ్చారు.