16 August, 2026 | 12:44 PM

సంగారెడ్డి కాంగ్రెస్‌కు శ్రీను బాబు దిశానిర్దేశం

16-08-2026 12:06 PM

సంఘటన్ సృజన్ అభియాన్’ విజయవంతానికి సమన్వయ సమావేశం

సంగారెడ్డి, మంథని, ఆగస్టు 16విజయక్రాంతి: సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరమయ్యాయి. ఆగస్టు 17న సంగారెడ్డిలో ఈ కార్యక్రమానికి అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు.

కార్యక్రమ నిర్వహణ, సమన్వయంపై టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంగారెడ్డి టీపీసీసీ పరిశీలకుడు దుద్దిళ్ల శ్రీను బాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లొల్ల సంజీవరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో శ్రీను బాబు సమావేశమై కార్యక్రమ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతూ, ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాథోడ్ ఆగస్టు 17న మీడియా సమావేశం నిర్వహించి ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారని తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. జిల్లాలో పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కీలకంగా నిలవనుందని శ్రీను బాబు పేర్కొన్నారు.