24 April, 2026 | 7:41 PM

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

24-04-2026 06:09 PM

బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసిఫాబాద్ డిపోలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, ఎఫ్‌సీఐ బోర్డు సభ్యులు పులగం తిరుపతి, కేశవరెడ్డి, గోవర్ధన్, విశాల్ ఖండ్రే తదితరులు కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఆసిఫాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం డిపో ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా కార్మికులు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.50 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ముందుగానే పరిష్కరించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదేమో లేదని అన్నారు.

గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని, కార్మిక సంఘాలను రద్దు చేసి వారి హక్కులను కాలరాసిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే గతంలో టీఆర్ఎస్‌కు ఎదురైన పరిస్థితులే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికీ ఎదురవుతాయని హెచ్చరించారు. కార్మికులు ధైర్యంగా పోరాటం చేయాలని, అయితే అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమ్మెకు బీజేపీ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.