హెజెలో కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికుల మృతి
మరో 9 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం పరిధిలోని హెజెలో కంపెనీలో శుక్రవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని కెమికల్ రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.షిఫ్ట్ మారే సమయంలో పేలుడు శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల నుంచి 10.30 గంటల మధ్య కార్మికులు షిఫ్టులు మారుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో రియాక్టర్ పేలింది. దీంతో మంటలు చెలరేగడంతోపాటు పేలుడు ధాటికి కంపెనీ పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్‌కు తరలింపు
ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్, హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కంపెనీ యాజమాన్యం గాయపడిన వారికి వైద్యం అందించే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
మృతులు వీరే
ప్రమాదంలో చెన్ను నాగిరెడ్డి (తండ్రి సైదిరెడ్డి), చెన్నూరు గ్రామం, పెద్దాపురం మండలం, నల్గొండ జిల్లా; గంగబోయిన నరేష్, చౌడారం గ్రామం, ఖమ్మం జిల్లా మృతి చెందారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
అధికారుల పరిశీలన
ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ఇన్‌స్పెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు, జిల్లా కార్మిక శాఖ అధికారులు శనివారం పరిశ్రమను సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. రెండు మూడు రోజుల్లో కంపెనీని సీజ్ చేస్తామని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలతో పాటు గాయపడిన వారి కుటుంబాలకు యాజమాన్యం నుంచి తగిన పరిహారం ఇప్పించి న్యాయం చేస్తామని అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు.
భద్రతా ప్రమాణాలు కఠినంగా అమలు చేయాలి
రసాయన పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.






