23 August, 2026 | 2:32 AM

నయన్‌తో ఢీకి సై!

23-08-2026 12:41 AM

సీనియర్ స్టార్ కథానాయిక నయనతార నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘మూకుతి అమ్మన్2’ ఒకటి. 2020లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న దైవభక్తి, ఫాంటసీ అంశాలతో వచ్చిన సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డాక్టర్ ఇషారి కే గణేశ్ నిర్మిస్తున్నారు. తొలి భాగానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా, రెండో భాగాన్ని ప్రముఖ నటుడు, దర్శకుడు సుందర్ సీ తెరకెక్కిస్తున్నారు.

సుందర్ సీ ఇప్పటికే ‘అరణ్మనై’ హారర్-కామెడీ ఫ్రాంచైజ్‌తో భారీ విజయాలు అందుకున్నారు. ఫాంటసీ, హారర్, కామెడీ, విజువల్ ఎలిమెంట్స్‌ను ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. ఇప్పుడు ‘మూకుతి అమ్మన్2’ను కూడా అదే స్థాయిలో భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారని సమాచారం. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో విజువల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ అంశాలు, యాక్షన్ సన్నివేశాలను మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ భారీ చిత్రంలో హీరోయిన్ రెజీనా కసాండ్రా కీలక పాత్రలో నటిస్తోంది. అంతేకాదు, ఆమె ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో కనిపించనుందని కోలీవుడ్ వర్గాల టాక్. దర్శకుడు సుందర్ సీ ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్‌ను ఎంతో శక్తిమంతంగా డిజైన్ చేశారట. రెజీనాను ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని సరికొత్త లుక్‌లో ఈ సినిమాలో చూపించనున్నారని వినికిడి. నయనతారకు దీటుగా సాగే ఈ పాత్ర కథలో అత్యంత కీలకంగా ఉండనుందట.  దీంతో ఈ చిత్రంలో నయనతార వర్సెస్ రెజీనా పోరాటం ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.