23 August, 2026 | 3:12 AM

అసలైన అందం ఆత్మవిశ్వాసమే!

23-08-2026 12:41 AM

అందచందాల ఆరబోతతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన త్రిప్తి డిమ్రీ వరుస అవకాశాలు అందుకుంటోంది. ‘యానిమల్’ చిత్రంలో తన అందచందాలతో ఆకట్టుకుందీ భామ. ఆ సినిమా తర్వాత గత ఏడాది ‘ధడక్-2’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందకుంది ఇప్పుడీ ముద్దుగుమ్మ తెలుగులో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’లో కథానాయికగా చాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఇదే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న త్రిప్తి డిమ్రీ.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

కాన్ఫిడెన్స్, గ్లామర్, ఆకర్షణ.. ఈ మూడింటిలో మీరు దేనికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారని యాంకర్ అడగ్గా.. త్రిప్తి ఏమాత్రం తడబడకుండా ఆత్మవిశ్వాసమే అసలైన అందం అని చెప్పింది. “నా దృష్టిలో కాన్ఫిడెన్స్ అనేది బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు. ఒక్కసారి మనపై మనకు పూర్తి నమ్మకం ఏర్పడితే మిగిలినవన్నీ దానంతట అవే మనల్ని అనుసరిస్తాయి. వయసు పెరిగే కొద్దీ అందం, ఆకర్షణపై నా ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది.

చిన్నతనంలో కేవలం శారీరక రూపం, పైకి కనిపించే అందం మాత్రమే ముఖ్యమనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా ఆలోచనా విధానం పూర్తిగా మారింది. నిజమైన ఆకర్షణ అంటే మనపై మనకున్న నమ్మకం, స్వయం గౌరవం, సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగి ఉండటమే. నలుగురిలోకి వెళ్లేముందు నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాను. ఇతరులతో సంబంధం ఏర్పరచుకోవడానికి ముందు, మన మనసుతో మనం కనెక్ట్ అవ్వడం అత్యంత కీలకం” అని అభిప్రాయపడింది త్రిప్తి డిమ్రీ.