7 August, 2026 | 7:59 PM

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

07-08-2026 07:09 PM

సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్

భద్రాచలం టౌన్,(విజయక్రాంతి): ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా అధికారులు, వివిధ ఆదివాసి సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని, ఈ  కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని గిరిజన ఆదివాసి ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, అధికారులు శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ కోరారు.

శుక్రవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో గిరిజన ఆదివాసి ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, అధికారులతో ఈ నెల 9న జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమం  ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమానికి వచ్చే ప్రముఖులకు ఆదివాసి గిరిజనుల సాంప్రదాయ ప్రకారము ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆదివాసి వంటకాలతో వారిని ఆనందింప చేసే విధంగా కార్యక్రమాలు ఏర్పాట్లు చేయాలన్నారు.

వచ్చే అతిధులకు మనమిచ్చే ఆతిథ్యంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాడు వివిధ ఆదివాసి తెగల గిరిజనులతో ర్యాలీలు, మహనీయులకు శ్రద్ధాంజలి ఘటించడం, జెండా ఆవిష్కరణ కార్యక్రమం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఛాయా చిత్ర ప్రదర్శనశాలలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని శ్రీమతి చందన, ఆర్సిఓ గురుకులం అరుణకుమారి, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, డిఎంజిసిసి సమ్మయ్య, ఏపిఓ పవర్ వేణు, తదితరులు పాల్గొన్నారు.