7 August, 2026 | 8:42 PM

ధరలు పెంచడం ప్రజల జీవన విధానాలపై భారం పడుతుంది

07-08-2026 07:32 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హయంలో అడుగడుగునా దేశ భవిష్యత్ ప్రశ్నార్థకం కానుందనే అనుమానం కలుగుతోందని, పేద సామాన్య ప్రజలపై భారం వేసేందుకు అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచి పెను భారం మోపడం దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార జాతా శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, గుంటూరుపల్లి,మొగ్దుం పూర్ గ్రామాల్లో ప్రచారం  నిర్వహించడం జరిగింది. 

బొమ్మకల్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం  పేదలకు విద్యా,వైద్యం అందుబాటులో లేకుండా చేస్తుందని,ఏటా రెండు కోట్ల ఉద్యాగాలు ఇస్తామని మోడీ చెప్పడంతో డిగ్రీలు చేతపట్టుకొని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని,ఉద్యోగాలు కాదు కదా ఉపాధి అవకాశాలు కూడా చూపడంలో మోడీ వైఫల్యం చెందారని ఆరోపించారు. కార్పొరేట్ దిగ్గజాలకే మోడీ ప్రభుత్వం మోకరిల్లుతుందని, విదేశీ పర్యటనలకే పరిమితమవుతూ, ప్రజలపై పెనుబారం మోపడమే లక్ష్యంగా, పెట్రోలు,డీజీలు,వంట గ్యాస్,నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటే విధమైన విధానాలకు పాల్పడుతున్నాడని, మహిళలపై చిన్న చూపుచూస్తున్నాడని,  పోరాడి సాధించుకున్న మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకపోవడం చూస్తుంటే మహిళలంటే ఎంతటి చిన్న చూపుందో అర్థమవుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా  మాట్లాడే వారిపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం,దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా హిందుత్వాన్ని ముందుపెట్టడం,మతాల మధ్య,ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించడం బీజేపీ పాలకులకు అలవాటుగా మారిపోయిందని,రానున్న రోజుల్లో బీజేపీ ఆటలు ఇక సాగవని ప్రజలు మార్పు కోరుకోక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని పంజాల శ్రీనివాస్ హెచ్చరించారు.