భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి దివ్యక్షేత్రం
దర్శన, ప్రసాద క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షణ
వాహనాలతో ట్రాఫిక్ జామ్
ఒక్కరోజే స్వామివారికి 62.55 లక్షల ఆదాయం
యాదాద్రి భువనగిరి, మే 25 (విజయక్రాంతి): వేసవి సెలవులు ముగింపు.. వాతావరణం చల్లబడటంతో యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో సందడిగా మారింది. కొండపై ఆలయ వీధులు, దర్శన క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లతో పాటు కొండ కింద పుష్కరిణీ, కల్యాణకట్ట, వ్రత మండపాలు భకుల్తతో కిక్కిరిసింది. స్వామివారి ధర్మ దర్శనానికి 3 నుంచి 4గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చిందని భక్తులు పేర్కొన్నారు.
కొండపైన పార్కింగ్ లేక కొండ కిందనే వాహనాలను నిలిపివేశారు. వాహనాల రద్దీతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కొండపై సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి సంగీత మండప నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు రూ. 10లక్షల విరాళం అందజేశారు. హైదరాబాద్ నారాయణగూడకు చెందిన పి నవనీత్‌రెడ్డి దంపతులు ఈ చెక్కును శనివారం ఆలయ ఇంజినీరింగ్ అధికారి దయాకర్‌రెడ్డి, ఏఈవోలు జి రఘు, రమేశ్‌కు అందజేశారు. శనివారం స్వామివారి ఆదాయం రూ. 62.55 లక్షలు వచ్చిందని ఈవో తెలిపారు.






