9 August, 2026 | 10:46 PM

నగరంలో నకిలీ డాక్టర్లు!

26-05-2024 01:37 AM

వైద్యమండలి ఆకస్మిక తనిఖీల్లో గుర్తింపు 

50 మందిపై కేసు, ఇద్దరు రిమాండ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (విజయక్రాంతి) : నగరంలో నకిలీ డాక్టర్లు పెరిగిపోతున్నారు. డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరం లేదు. కేవలం సూది, మందులు ఇవ్వడం వస్తే చాలు, ఏకంగా ఆస్పత్రులే నెలకొల్పుతున్నారు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వారిపై తెలంగాణ వైద్య మండలి కొరఢా ఝుళిపించింది.  వైద్య మండలి అధికారులు శనివారం ఎనిమిది వేర్వేరు బృందాలుగా ఏర్పడి, ఒకేసారి నగరంలోని ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి సుమారు 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు.

ఈ క్రమంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు గుర్తించారు.  ఆస్పత్రులకు అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి రోగుల నుంచి వేలల్లో ఫీజులు వసూలు  చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన 50 మంది నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. ఈ తనిఖీల్లో డాక్టర్లు ప్రతిభాలక్ష్మి, కిరణ్ కుమార్, సన్నీ డేవిస్, ఇమ్రాన్ అలీ, కే.విష్ణు, పాండు, సిబ్బంది పాల్గొన్నారు. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య మండలి అధికారులు సూచించారు.