యాదవులు హక్కుల సాధనకు ఉద్యమించాలి
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ముషీరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): యాదవ జాతి మొత్తం ఐక్యంగా ఉండాలని, అప్పుడే రాజకీయంగా అభివృద్ధి సాధించగలమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు శనివారం నాంపల్లిలోని తెలుగు అకాడమీలో నిర్వహించిన దక్షిణ భారత యాదవ ప్లీనరీకి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మన జాతి పెద్ద సంఖ్యలో ఉందన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో జనరల్ స్థానాలలో పోటీ చేసి అత్యధిక స్థానాలలో యాదవులే సర్పంచ్‌లుగా గెలిచారని చెప్పారు. పార్టీలు ఏవైనా మనమంతా యాదవజాతి అనే విషయాన్ని మరువొద్దన్నారు. నీతి నిజాయితీకి మారుపేరు యాద వులని, మనం శ్రీ కృష్ణుడు వారసులం అన్నారు. గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఎంతో చైతన్యం వచ్చిందని తెలిపారు.
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మొదటగా తెరిచేది మన యాదవు డేనని చెప్పారు. వారినే గొల్ల మిరాసి అంటారని, ఈ వ్యవస్థను తొలగించాలని చూస్తే తాను తీవ్రంగా వ్యతిరేకించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బళ్ళారి నగర మేయర్ గాదెప్ప యాదవ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన యాదవ సంఘం ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.




