పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు
17-03-2026 12:27 AM
- బాలికపై స్కూల్ అటెండర్
- లైంగిక దాడి కేసులో మెదక్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు
మెదక్, మార్చి 16 (విజయక్రాంతి): మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో చిన్నారిపై జరిగిన లైంగిక దాడి కేసులో మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు నేరస్థుడికి 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించిందని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడు సారా జైపాల్ (25) ఓ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తూ, అక్కడ చదువుతున్న విద్యార్థినిపై 2019 జూన్‌లో లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విచారణ అనంతరం కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసును విచారించిన మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావల్లి నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు బాధితురాలికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించారు.




