15 April, 2026 | 2:21 AM

కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలి

29-12-2025 01:28 AM

మిర్యాలగూడ,  డిసెంబర్ 28 (విజయక్రాంతి) : బాలికలు కష్టపడి చదివి  ఉన్నత స్థానంలో నిలవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్నారు. నాణ్యమైన విద్యను అభ్యసించడం ద్వారానే  అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు.ఆదివారం మంత్రి నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండల కేంద్రంలో సుమారు 6 కోట్ల 74 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాల, కళాశాల భవనాలను ప్రారంభించారు. అదేవిధంగా 64 లక్షల  50 వేల  రూపాయలతో నిర్మించనున్న ప్రహరికి  శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అమ్మాయిలు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. మాడుగుల పల్లి కేజీబీవీ నుండి గతంలో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థినిని విశాఖపట్నం కు ఫ్లైట్ ద్వారా పంపించడం జరిగిందని,  ఈ సంవత్సరం  ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకున్న వారి  చదువు ఖర్చులన్ని తానే భరిస్తానని మంత్రి తెలిపారు. మాడుగుల పల్లి కె జి బి వి పాఠశాల అభివృద్ధికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమయ్యే సహకారాన్ని అందిస్తానన్నారు .

అమ్మాయిలు బాగా కష్టపడి చదువుకోవాలని, అబ్దుల్ కలాం చెప్పినట్లు మంచి కలలు కనడమే కాకుండా, వాటిని సాధించుకోవాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి చదువు చెప్పాలని  అన్నారు .నల్గొండ జిల్లా కేంద్రంలో బొట్టుగూడా ప్రాథమిక పాఠశాలను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 3 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన సౌకర్యాల తో నిర్మాణం చేపట్టడం జరిగిందని, సంక్రాంతి లోపు రాష్ట్ర ముఖ్యమంత్రి చేత దానిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ప్రతిభ ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని, అందువల్ల ప్రజలు ప్రైవేటు పాఠశాలల వైపు ఆలోచించవద్దని  తెలిపారు.నల్గొండ జిల్లా కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు పురోగతిలో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు.

కెజిబివి  పాఠశాలకు డ్యూయల్ డెస్క్ లు కావాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కోరిన మీదట మంత్రి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన  ఫర్నిచర్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.మాడుగుల పల్లి మండల కేంద్రంలో 14 కోట్ల రూపాయలతో తహసిల్దార్, ఎంఈఓ, పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ గత సంవత్సరం బాగా చదివి మంచి జిపిఎ తెచ్చుకున్న విద్యార్థులను ఫ్లైట్ ద్వారా విశాఖపట్నం పంపించామని, ఈ సంవత్సరం స్థలంతో నిమిత్తం లేకుండా దేశంలో ఎక్కడికైనా పంపిస్తామని, అందువల్ల కష్టపడి చదవాలని సూచించారు.

మాడుగుల పల్లి కె జి బి వి కి కొత్త బిల్డింగు రావడం వల్ల అన్ని సౌకర్యాలు సమకూరుతాయని చెప్పారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , మాడుగులపల్లి సర్పంచ్ నరేష్ లు మాట్లాడారు.ముందుగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సునీత పాఠశాల రిపోర్టు చదివి వినిపించారు.మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఇన్చార్జి డిఆర్‌ఓ వై .అశోక్ రెడ్డి, డీఈవో బిక్షపతి, స్థానిక తహసిల్దార్, ఎంపీడీవో,ఎం ఈ ఓ, ప్రజా ప్రతినిధులు, తదితరులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.