పక్కా స్కెచ్‌తో హత్య.. కెనాల్ వద్ద మృతదేహం కలకలం!

28-09-2026 | 10:35am

 వివాహేతర సంబంధమే కారణమా?

హుజురాబాద్,సెప్టెంబర్ 28:(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని(Huzurabad Mandal) పెద్ద పాపయ్య పల్లె గ్రామంలోని కేసీ కెనాల్ వద్ద మృతదేహం కలకలం లేపింది. వివాహేతర సంబంధం నెపంతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థి పక్కా స్కెచ్ వేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచి కిరాతకంగా హతమార్చాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హన్మకొండ జిల్లా(Hanumakonda District) కమలాపూర్ మండలం ఉప్పలపల్లి గ్రామానికి చెందిన వడిగే రాకేశ్(32)ను, అదే గ్రామానికి చెందిన అంబరగొండ ప్రశాంత్ హత్య చేసాడు. పథకం ప్రకారం పెద్దపాపయ్యపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు రప్పించి చంపాడా? లేక వేరే ప్రాంతంలో హతమార్చి కెనాల్ వద్దకు తెచ్చి పడేశాడా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

 వివాహేతర సంబంధమే కారణమా?

నిందితుడి భార్యతో రాకేశ్కు వివాహేతర సంబంధం(Extramarital affair) ఉందన్న అనుమానమే ఈ దారుణానికి దారి తీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మరికొందరి సహకారంతో పకడ్బందీ వ్యూహం రచించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య అనంతరం నిందితుడు ప్రశాంత్ స్థానిక పోలీసులకు లొంగిపోయినట్లు జోరుగా ప్రచారం సాగుతుండగా, పోలీసులు మాత్రం దీనిని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ ఆధారాలు, వేలిముద్రలను సేకరించింది. ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు