18-02-2026 12:00:00 AM
ఐ ప్రసాదరావు :
దేశం ఏదైనా అభివృద్ధి సాధించాలంటే అది యువతపైనే ఆధార పడి ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించి చూస్తే మన దేశ జనాభాలో అధికంగా యువతే ఉండడం మనకు ఒక వరమని చెప్పవచ్చు. ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యధికంగా యువత కలిగిన దేశం మన భారత్. దేశ జనాభాలో దాదాపు 65 శాతం యువతే ఉ న్నారు. వీరందరూ దాదాపు 35 సంవత్సరాల్లోపు వారే కావడం విశేషం. ఇక భారత్‌లో దాదాపు 371 నుంచి ౪20 మిలియన్ల జనాభా 15 నుంచి 29 సంవత్సరాల మధ్యే ఉన్నారని ఇటీవలే యూనిసెఫ్ నివేదిక కూ డా పేర్కొంది.
వీరిలో 268 మిలియన్ల యువత గ్రామీణ ప్రాంతాల్లో, 152 మిలియన్ల యువత పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపింది. ఈ యువత మొత్తాన్ని ‘డెమెగ్రాఫిక్ డివిడెండ్’ (జనాభా విభజన)గా పిలుస్తారు. ఈ యవ జనాభాను సరైన రీతిలో వినియోగించుకోవడం ద్వారానే దేశ ఆర్థికవృద్ధి జరగ డంతో పాటు, 2047 నాటికి మనం కలలు కంటున్న ‘వికసిత్ భారత్’ సాధ్యమవుతుందని గ్రహించాలి. అయితే ఈ జనాభా డివిడెండ్ ను సద్వినియోగం చేసుకోవడంపైనే నేటి పాలకులు దృష్టి పెట్టాలి. సవాళ్ల ను ఎదుర్కోవడం, సమస్యలు పరిష్కరించడంపైనే దేశవృద్ధి ఆధారపడి ఉంటుందని భావించాలి.
విద్యకు ప్రాధాన్యతేది?
దేశ యువతకు సరైన విద్య అందించాలి. ముఖ్యంగా నైపుణ్యతకు పెద్ద పీట వేయాలి. మన దేశంలో ఉన్నత పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు తగినంత ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు లేక విలవిల్లాడుతున్నాయి. అంతర్జాతీయంగా రోజు వారి వస్తున్న మార్పులు ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక మార్పులు అందిపుచ్చుకునే విధంగా సంసిద్ధంగా ఉండాలి. రోబోటిక్స్, ఆటోమేషన్, సాఫ్ట్‌వేర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), చాట్ జీపీటీ వంటి అంశాల్లో తగిన ప్రావీణ్యత సాధించుకోవాలి.
ప్రభుత్వాలు కూడా విద్యా రంగానికి తగినంత ప్రా ధాన్యతనివ్వడం ఉత్తమం. ముఖ్యంగా బడ్జెట్‌లో నిధులు ఎక్కువగా కేటాయించాలి. సు మారు ఐదు దశాబ్దాల క్రితం కొఠారి కమిషన్ చెప్పిన జీడీపీలో 6 శాతం నిధుల కేటా యింపులను ఇప్పటికీ మన ప్రభుత్వాలు జరపడం లేదు... నేటికీ దేశ జీడీపీలో కేవలం మూడుశాతం లోపే విద్యా రంగానికి కేటాయింపులు జరుగుతుండడం ఆలోచించాల్సి న అంశం.
కానీ అదే క్యూబా లాంటి చిన్న దేశంలో విద్యా రంగానికే 9.39శాతం నిధు లు ఖర్చు చేస్తుండడం గమనార్హం. మన దేశంలో కేరళ రాష్ట్రం మాత్రమే విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నది. అలాగే ఆప్ ప్రభుత్వం హాయాంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి కో సం స్కిల్డ్ యూనివర్సిటీ అని, అన్ని రకాల ఉన్నత ప్రమాణాలతో కూడిన అందించేందుకు నూతన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయడం మంచి పరిణామమే అని చెప్పొచ్చు. ఇవన్నీ ఆచరణలోకి వస్తే తెలంగాణ అభివృద్ధి పథంలో పయనించడం ఖాయం.మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభు త్వం ‘నాడు కార్యక్రమం ద్వారా పాఠశాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం స్వాగతించాల్సిన అంశం.
కానీ తెలుగు మీడి యం పూర్తిగా రద్దు చేసి, ఇంగ్లీష్ మీడియం అమలు చేయడం, ఆరు రకాల పాఠశాలల ఏర్పాటు చేసి ముఖ్యంగా మూడు నుంచి పది తరగతులను మెర్జింగ్ చేయడం తదితర ప్రయోగాల వల్ల ఆ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అతలాకుతలమయ్యింది. ఇక కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలు ఏర్పాటు చేసి, ఉన్న విద్యా వ్యవస్థను ప్రయోగశాలగా మార్చడంతో మరింత గందరగోళం ఏర్పడింది.
ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నత ప్రమాణాలు ఎలా సాధ్యమనే ది పాలకులు తెలపాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రాధమిక విద్య ఆయా దేశాల మాతృభాష లో బోధన జరుగుతూ, విద్యార్థులు అనేక రంగాల్లో రాణిస్తుంటే, దీనికి విరుద్ధంగా మ న తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిగితే, అంతర్జాతీయ విద్యార్థులుగా మారుస్తామని చెప్పడం హాస్యాస్పదం గా అనిపిస్తున్నది.
సమస్యల వలయం..
జనాభా విభజన మరింత సత్ఫలితాలను ఇవ్వాలంటే అందరికీ మంచి ఆరోగ్యం సమకూర్చవలసిన బాధ్యత కూడా నేటి ప్రభుత్వా లపై ఉంది. ఈ రంగాన్ని కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం జరిగింది. దేశంలో చాలా మంది బాలబాలికలు పోషకాహారం లోపం వల్ల అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు శరీర ద్రవ్యరాశి సూచిక (బాడీ మా స్ ఇండెక్స్)లోనూ భారీ తేడాలు కనిపిస్తున్నాయి..
యువత శారీరక శ్రమ లేకపోవడం వల్ల స్థూలకాయం, మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రభుత్వాలు కూడా క్రీడలకు తగిన నిధులు విడుదల చేయకపోవడం గమనార్హం. తల్లిదండ్రులు కూడా ఎల్లప్పు డూ చదువులు, మార్కులు, గ్రేడులకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఆటలకు దూరమవుతున్న పిల్లలు క్రమంగా అనారోగ్యానికి గురవుతున్నారు.
దేశానికి యువతే బలం అని చెప్ప డం, ఒలింపిక్స్‌లో మెడల్ సాధించాలని ప్ర భుత్వాలు తమ ఆంక్షలను చెప్పడమే తప్పిస్తే ఆచరణ మాత్రం శూన్యం. అందుకే ఒలింపిక్స్‌లో ఇప్పటికీ మన క్రీడాకారులు పతకాలు సాధించడం అందని ద్రాక్షలాగే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు, తల్లిదండ్రులు ఇకనైనా యువత విద్య కోసం, ఆరోగ్య సంరక్షణ కోసం ప్రణాళిక పద్ధతిలో ప్రయాణం చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా తయారయ్యేందుకు ప్రోత్సమించాలి.
సంఘ విద్రోహ శక్తులు..
ఇటీవల కాలంలో సెల్‌ఫోన్లు, మత్తు పదార్థాలకు యువత ఎక్కువగా బానిసలవుతున్నారు. ఇది కూడా కుటుంబ వ్యవస్థకు, దేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్‌గా మారిం ది. తల్లిదండ్రులు, ప్రభుత్వాలు, మీడియా కూడా తమ పాత్ర సరైన రీతిలో పోషించాలి. వాస్తవానికి మన దేశ యువతకు సరైన సౌకర్యాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపో వడమే ఈ అనర్థాలకు కారణం. ఉపాధి లేక చదువుకున్న వారు, నైపుణ్యాలు ఉన్న వారు కూడా సంఘ విద్రోహ చర్యలకు ఆకర్షితులవుతున్నారు.
తాజా ‘కొర్బా వంతెన’ దొంగి లింపు ఉదంతమే ఇందుకు ఉదాహరణ. 70 అడుగులు పొడవు, 10 టన్నుల బరువు ఉన్న వంతెన రాత్రికి రాత్రే మాయం చేసిన నిందితుల్లో అగ్రభాగం యువకులే ఉండ డం గమనార్హం. సైబర్ క్రైమ్ చేస్తున్నవారిలోనే యువతే ఎక్కువగా ఉన్నారు.
సంఘ విద్రోహ శక్తులుగా, రకరకాల వ్యసనాలకు బానిసలుగా మారుతున్నవారిలోనూ యు వతే అధికం. సరైన దిశ, లక్ష్యం లేకపోవడం, సామాజిక మాధ్యమాల ప్రభావం, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల విధానాలు వల్ల నేటి యువత ఆశించిన స్థాయిలో ఉత్పాదక రంగంలో సరైన సామర్థ్యం చూపలేకపోతున్నారు. దీంతో భారత్ ఆర్థిక వ్యవస్థ, జీడీపీ వృద్ధిరేటు కుంటుపడుతుంది.
ఆర్థిక ప్రభావం..
దేశంలో మహిళలు భాగస్వామ్యం కూ డా అంతంత మాత్రమే ఉండటం కూడా దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడేందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. నాణ్యమైన, సమాన విద్య అని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ అది పుస్తకాలకే పరిమితమయ్యింది. దీనికి తోడు ఆర్థికంగా అభివృద్ధి చెందిన కుటుంబాల్లో ఉన్నత చదువుల పేరుతో విదేశాలకు వలసలు వెళ్లడం కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దేశంలో యువశక్తి భారీగా ఉన్నప్పటికీ పైన చెప్పి కారణాల వల్ల భారత్ ఇప్పటికీ అనేక రంగాల్లో వెనుకబడి ఉంది.
ఇప్పటికైనా ప్రభుత్వాలు విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను బలోపేతం చేయాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడు మాత్రమే మనకు ఉన్న యువశక్తి దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక వ్యవస్థకు యంత్రంగా మారుతారు. అప్పుడే మనం కలగంటున్న వికసిత్ భారత్ సాధన లక్ష్యం నెరవేరుతుంది.
వ్యాసకర్త సెల్: 6305682733