19-02-2026 12:00:00 AM
నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి :
భారత చరిత్రలో జయంతులనేవి కేవలం స్మరణార్థక తేదీలు మాత్రమే కాదు. అవి ఒక యుగాన్ని, ఒక ఆలోచనను, ఒక ఆదర్శాన్ని నేటి తరాలకు చేరవేసే అవకాశాలు. అటువంటి జయంతుల్లో అత్యంత ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ప్రత్యేకమైనది. ఆయన జీవితం త్యాగాల గాథ, పాలన ధర్మానికి ప్రతిరూపం, ఆలోచన స్వాభిమాన భారతానికి పునాది. సాధారణ స్థితి నుంచి అసాధారణ శిఖరాలకు ఎదిగిన శివాజీ మహారాజ్ జీవితం ఒక ఆదర్శం.
అప్పటి రాజకీయ అరాచకత, పరాధీనత, అణచివేతల మధ్య ఆయన బాల్యం గడిచింది. తల్లి జిజియా బాయి ధర్మబోధన, దేశచరిత్రపై ఉన్న అవగాహన ఆయనలో చిన్ననాటి నుంచే ‘స్వరాజ్యం’ అనే మహాస్వప్నాన్ని నాటాయి. శివాజీ మహారాజ్ వీరత్వాన్ని చాలామంది ఖడ్గం, కోటలు, యుద్ధాలకే పరిమితం చేస్తారు. కానీ ఆయన అసలైన వీరత్వం ఆలోచనలో ఉంది. మొఘల్ శక్తిని ఎదుర్కొనే క్రమంలో ధైర్యం కోల్పోకుండా, ఓటమిని అంగీకరించకుండా వ్యూహాన్ని మార్చుకో వడం శివాజీ బలాలు.
నేటి యువత ఎదుర్కొంటున్న పోటీ ప్రపంచంలో ఇది అవసరమైన గుణం. ఓటమి వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగడం అంటే ఏమిటో శివాజీ జీవిత చరిత్ర బోధిస్తుంది. శివాజీ మహారాజ్ జీవితం సౌఖ్యాల కోసం కాదు, త్యాగాల కోసం అంకితమైంది. వ్యక్తిగత ఆనందం కన్నా ప్రజల భద్రత, స్వరాజ్య పరిరక్షణే ముఖ్యమని భావించారు. శివాజీ స్థాపించిన స్వరాజ్యం కేవలం రాజకీయ వ్యవస్థ కాదు; అది నైతిక విలువల రాజ్యం.
స్త్రీల పట్ల గౌరవం, రైతుల రక్షణ, అధికారులపై నియంత్రణ, న్యాయపాలన.. ఇవన్నీ శివాజీ ప్రతిష్టను రెట్టింపు చేశాయి. ఇవాళ యువత ముందు నిరుద్యోగం, దిశాహీనత, విలువల క్షీణత లాంటి సవాళ్లున్నాయి. అయితే వీటిని అధిగమించే క్రమంలో శివాజీ ఆత్మవిశ్వాసం, స్వాభిమానం, క్రమశిక్షణ, దేశభక్తి ఒక పాఠం లాంటివి. ‘స్వరాజ్యమంటే భూభాగం కాదు స్వాభిమానం’, ‘వీరత్వం అంటే హింస కాదు ధైర్యం’.. ఇవి శివాజీ మనకిచ్చిన సందేశాలు.
మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొనడంలో శివాజీ మహారాజ్ ‘గెరిల్లా’ అనే వినూత్న యుద్ధరీతిని అవలంబించారు. కొండలు, అడవులు, కోటలను ఆధారంగా చేసుకొని సాగే గెరిల్లా యుద్ధం శత్రువుకు నిద్ర లేకుండా చేసింది. ఇది సైనిక నైపుణ్యమే కాదు భారతీయ భూభాగానికి తగిన వ్యూహాత్మక మేధస్సు. స్త్రీల పట్ల ఆయన చూపిన గౌరవం శివాజీని ప్రత్యేకంగా నిలబెట్టింది.
యుద్ధాల్లో విజయం సాధించిన తర్వాత శత్రు మహిళల పట్ల మర్యాదతో వ్యవహరించడం ఆయన ధర్మ పాలనకు నిదర్శనం. పన్నుల విషయంలో న్యాయం, రైతులకు రక్షణ, అధికారులపై కఠిన నియంత్రణ.. శివాజీ పాలనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. ‘రాజ్యం ప్రజల కోసం, ప్రజలే రాజ్యానికి మూలం’ అన్న భావనను ఆయన కార్యరూపంలో చూపించారు. శివాజీ మహారాజ్ వీరత్వం కేవలం యుద్ధ విజయంలోనే కాదు ఆయన ఆలోచనల్లో, పాలనలో, ధర్మనిష్ఠలో ప్రతిఫలించింది. అందుకే ఆయన భారత జాతి గర్వించదగిన మహావీరుడు.