calender_icon.png 13 September, 2024 | 12:12 AM

జొమాటో లాభం 253 కోట్లు..

02-08-2024 12:57:24 AM

దిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో (Zomato) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.253 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 74 శాతం పెరిగి రూ.4,206 కోట్లకు చేరినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఎబిటా రూ.299 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.194 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో జొమాటో మొదటి సారి రూ.2 కోట్ల నికర లాభాన్ని, రూ.2,416 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

ఫుడ్ డెలివరీతో పాటు, క్విక్ కామర్స్ విభాగంలోనూ రాణిస్తూ కంపెనీ లాభాల బాట పట్టింది. వరుసగా త్రైమాసికాల్లో లాభం నమోదు చేయడం ఇది ఐదోసారి. సమీక్షా త్రైమాసికంలో ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, ఇతర వ్యాపారాల స్థూల ఆర్డర్ల విలువ 53 శాతం వృద్ధి చెంది రూ.15,455 కోట్లకు చేరినట్లు జొమాటో పేర్కొంది. ఫుడ్ డెలివరీ విభాగంలో ఏడాదికి 27 శాతం పెరిగితే క్విక్ కామర్స్లో 130 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది.