బాసర ఐఐఐటీలో నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు

27-10-2026 | 05:25am

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): బాసర ఐఐఐటి(Basara IIIT) (ఆర్జియుకేటీ)లో విద్యార్థులకు నీటి కోరుతా పై విజయక్రాంతి దినపత్రికలో సోమవారం 'బాసర ట్రిపుల్ ఐటీకి నీటి గండం' అనే వార్తకు అధికారులు స్పందించారు. బాసర ట్రిపుల్ ఐటీ((Basara IIIT) ) లో చదువుకుంటున్న విద్యార్థులకు నీటి సమస్య  కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(District Collector Bhavesh Mishra) తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, బాసర ఐఐఐటి ను సందర్శించారు.

ఈ సందర్భంగా విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఐఐఐటి లో విద్యార్థులు(Students), అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కలిపి పదివేల మంది వరకు ఉంటారని, వారికి తాగునీరు(Drinking water), రోజువారి అవసరాల నిమిత్తం  ప్రతి రోజూ దాదాపు15 లక్షల లీటర్ల వరకు నీరు కావాలని అన్నారు.  గోదావరి నది వద్ద ప్రత్యేకంగా ఐఐఐటి కోసం 60 హెచ్ పి సామర్థ్యం గల మూడు మోటార్లు అందుబాటులో ఉండగా, వాటిలో ప్రస్తుతం ఒకటి పూర్తిస్థాయిలో పని చేయగా, రెండు పనిచేయడం లేదని అన్నారు.

ఈ విషయం తమ దృష్టికి రాగానే రెండు మోటార్ల మరమ్మత్తుల కొరకు 8 లక్షల రూపాయలను కేటాయించినట్లు వివరించారు. ఇప్పటికే సంబంధిత సాంకేతిక నిపుణుల బృందం ఇంటెక్ వెల్ ను సందర్శించిందని తెలిపారు. పది రోజుల్లోనే రెండు మోటార్లను బాగు చేసి నీటి సరఫరాకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఒక మోటారు దాదాపు రోజుకు 25 లక్షల లీటర్లను సరఫరా చేయగలదని వివరించారు. ఈ నీరు ఐఐఐటి రోజువారీ అవసరాలకు సరిపోతుందని చెప్పారు.

పెరుగుతున్న నీటి అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరొక నూతన మోటార్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఐఐఐటి అవసరాలకు ఇంకనూ నీరు అవసరమైతే రోజుకు 10 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయగలిగే సామర్థ్యం ఉన్న గ్రామపంచాయతీ ఇంటెక్ వెల్ నుంచి 1.3 నుంచి 1.5 ఎంఎల్ డి నీటిని అందిస్తామని అన్నారు. అంతేకాకుండా గ్రామపంచాయతీ నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. ఐఐఐటి ప్రాంగణంలో 29 ఎకరాల విస్తీర్ణంలో నీటి నిల్వ కుంట అందుబాటులో ఉందని, దాని ద్వారా కూడా ఐఐఐటి అవసరాలకు ఉపయోగపడుతుందని అన్నారు.

ప్రస్తుతం ఆ కుంటను శుభ్రం చేసి మరింత మెరుగ్గా అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం నీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బందులు లేవని, విద్యార్థులకు రెండు, మూడు రోజుల్లోనే భౌతిక తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంటనే భౌతిక తరగతులు ప్రారంభించేలా సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు రోజువారి నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

నీరు తగినంత లభ్యంగా ఉందని, నీటి సరఫరా లోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు గోదావరి నది వద్ద గల ఐఐఐటికి నీటిని సరఫరా చేసే ఇంటెక్ వెల్ ను పరిశీలించారు. నీటి సరఫరా కు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు మోటార్లకు అవసరమైన పరికరాలను తెప్పించి, వీలైనంత త్వరగా మరమ్మతులను పూర్తిచేయాలని అన్నారు. 

ఆ తర్వాత ఐఐఐటి ప్రాంగణంలోని నీటి కుంటను, పంపు  హౌస్ ను పరిశీలించారు.  ఈ కార్యక్రమాల్లో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, గ్రిడ్ డిఈఈ, ఈఈ లు రాజేశ్వర్ రావు రాఘవేంద్ర రెడ్డి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపిడివో దేవేందర్ రెడ్డి, ఐఐఐటి డీన్ లు మహేష్, విఠల్, విద్యార్థి సంక్షేమ అధికారి నాగరాజు, సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు