'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమం
నిర్మల్ సెప్టెంబర్ 29 ( విజయ క్రాంతి): పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అనే సందేశంతో నిర్మల్ పట్టణంలో మంగళవారం 'స్వచ్ఛతా హీ సేవ'(swachhata hi seva) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న ఈ మాసోత్సవాల్లో భాగంగా, బ్యాంక్ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది.
సంయుక్తంగా ధర్మసాగర్ పరిసర ప్రాంతాలతో పాటు బస్ స్టాండ్ ఆవరణలో భారీ పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగిన ఈ కార్యక్రమంలో ప్రజా ప్రయోజనార్థం పరిసరాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ కార్యక్రమంలో అధికారులంతా స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. వీధి పరిసరాలు, ప్రజా రవాణా కేంద్రాల వద్ద చెత్తను తొలగిస్తూ పరిసరాల శుభ్రత ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుని బాధ్యత అని గుర్తు చేశారు.
ప్రతి పౌరుడు తమ ఇల్లు, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి బాబు, ఎల్డీఎం రామ్ గోపాల్, టీజీబీ రీజినల్ మేనేజర్ నవీన్ తో పాటు పలువురు బ్యాంకింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది స్వయంగా పాల్గొన్నారు.