అంతర్ పాఠశాలల క్రీడా వారోత్సవాలు
- విజయ మేరీ ఉన్నత పాఠశాల ఆవరణలో మూడు రోజుల పాటు పోటీలు
- ప్రారంభించనున్న ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి
బోధన్, నవంబర్ 11 (విజయ క్రాంతి): బోధన్ మండలంలోని అర్బన్, రూరల్ ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు అంతర్ పాఠశాలల క్రీడా వారోత్సవాలను(Inter-school Sports Week) నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి నాగయ్య(Mandal Educational Officer Nagayya) తెలిపారు.
ఈ క్రీడా వారోత్సవాలు నవంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు బోధన్ పట్టణంలోని విజయ మేరీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి హాజరై క్రీడా వారోత్సవాలను ప్రారంభించనున్నారు.
విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బోధన్ మండల అర్బన్, రూరల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పత్రికా మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగయ్య కోరారు. క్రీడా వారోత్సవాల విశేషాలను ప్రజలకు చేరవేసి విద్యార్థులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.