గురుకులంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

11-11-2026 | 06:09pm
  1. పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..
  2. ప్రణాళికాబద్ధంగా చదవాలి..
  3. మైనారిటీ గురుకులంలో వసతి, భోజనం, పారిశుద్ధ్యంపై ఆరా..
  4. బహద్దూర్‌పేట పాఠశాలనూ పరిశీలించిన కలెక్టర్

ఆలేరు, నవంబర్ 11 (విజయక్రాంతి): ఆలేరులోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి(District Collector Anurag Jayanti) బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు, భోజనం, వసతి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ముందుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలోని వంటగది, భోజనశాల, మరుగుదొడ్లు, విద్యార్థినుల వసతి గదులను పరిశీలించారు.

విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరుగుతోందా? అని సిబ్బందిని ప్రశ్నించారు.

పదో తరగతి విద్యార్థినులకు కలెక్టర్ దిశానిర్దేశం:

పదో తరగతి విద్యార్థినులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్.. వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. ప్రతి సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధించాలని, సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు.

ఉన్నత విద్యతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి సాంకేతిక విద్యా కోర్సులు, వివిధ పోటీ పరీక్షలు, భవిష్యత్తులో అందుబాటులో ఉండే ఉద్యోగ అవకాశాలపై ఇప్పటి నుంచే అవగాహన పెంచుకోవాలని విద్యార్థినులకు సూచించారు. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భోజనం, వసతి సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

చిన్నారులతో ముచ్చటించిన కలెక్టర్:

అనంతరం ఆలేరు మండలంలోని బహద్దూర్‌పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడి ప్రతిరోజూ నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా? గుడ్డు పెడుతున్నారా? అంటూ అడిగి తెలుసుకున్నారు. చదువుకు సంబంధించిన చిన్న చిన్న ప్రశ్నలు వేసి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు.

మెనూ ప్రకారం పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ తనిఖీల్లో ఇన్‌చార్జి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జయమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, ఎమ్మార్వో ఆంజనేయులు, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు