కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

10-11-2026 | 08:27pm

సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం.. మెనూ ప్రకారం భోజనం వండాలని ఆదేశం

బోధన్, నవంబర్ 10 (విజయక్రాంతి): మెండోరా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, మరుగుదొడ్లు, తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు. స్టోర్ రూంలో నిల్వ ఉంచిన పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ద్వారా సిబ్బంది హాజరు వివరాలను తనిఖీ చేశారు.

అనంతరం విద్యార్థినులకు సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనం మెనూ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూలో క్యారెట్ కూర ఉండాల్సి ఉండగా, అందుకు బదులుగా ఆలూ కూర వండటాన్ని గమనించిన కలెక్టర్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో డైట్ మెనూను రూపొందించిందని, దానిని పక్కనపెట్టి ఇష్టానుసారంగా భోజనం తయారు చేస్తే విద్యార్థులకు ఎలా మేలు జరుగుతుందని ప్రశ్నించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని సిబ్బందిని మందలించారు.

తదుపరి ఆరో తరగతి గదిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడారు. పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యాసన సామర్థ్యాన్ని, విద్యా ప్రమాణాలను అంచనా వేశారు. విద్యార్థినులు ఉత్సాహంగా సమాధానాలు చెప్పడంతో వారిని అభినందించారు. ఈ సందర్భంగా తన వెంట తీసుకువచ్చిన చాక్లెట్లు, బహుమతులను చిన్నారులకు అందజేసి ప్రోత్సహించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన వసతులు కల్పించడంలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు