మరిచిపోయిన బాధితురాలికి నగదు

06-11-2026 | 12:26am

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్

బోధన్ పోలీసుల చొరవతో నగదు తిరిగి అందజేత

బోధన్,(విజయక్రాంతి): బస్సులో ప్రయాణిస్తూ మరిచిపోయిన రూ.87 వేల నగదును ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ చొరవతో బాధితురాలికి తిరిగి అందజేసిన ఘటన బోధన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌కు చెందిన సంధ్య అనే మహిళ బోధన్‌లోని బ్యాంకులో రూ.87 వేల నగదును డిపాజిట్ చేసేందుకు నిజామాబాద్ నుంచి బస్సులో బయలుదేరారు. బుధవారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో షక్కర్‌నగర్ వద్ద బస్సు దిగే క్రమంలో నగదు ఉన్న కవర్‌ను తాను కూర్చున్న సీటుపైనే మరిచిపోయి వెళ్లిపోయారు.

విషయాన్ని గుర్తించిన ఆమె వెంటనే బోధన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. స్పందించిన బోధన్ పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి, అప్పటికే డేగ్లూర్ వైపు వెళ్తున్న బస్సులో తనిఖీలు చేయించారు. బస్సు డ్రైవర్ సలీం, కండక్టర్ హనుమాన్ సహకారంతో సీటుపై మరిచిపోయిన రూ.87 వేల నగదు ఉన్న కవర్‌ను గుర్తించారు. అనంతరం డ్రైవర్, కండక్టర్ నగదును భద్రంగా పోలీసుల సమక్షంలో బాధితురాలికి తిరిగి అందజేశారు. పోగొట్టుకున్న నగదు తిరిగి లభించడంతో సంధ్య ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు, నిజాయితీగా వ్యవహరించిన డ్రైవర్ సలీం, కండక్టర్ హనుమాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది నిజాయితీని పలువురు అభినందించారు.

మరిన్ని వార్తలు