మూడేళ్లుగా టీచర్లు లేరు.. నాలుగు నెలల్లో పదో తరగతి పరీక్షలు!
- భీమ్గల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థినుల ఆందోళన
- మ్యాథ్స్, సోషల్, తెలుగు, ఉర్దూ సబ్జెక్టులకు బోధకులు కరువు
- ప్రహరీ గోడ లేక రక్షణ కరువు
బోధన్, నవంబర్ 10 (విజయక్రాంతి): భీమ్గల్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల(Bhimgal Government Girls High School) (ఉర్దూ మీడియం)లో ఉపాధ్యాయుల కొరత విద్యార్థినుల చదువులకు తీవ్ర ఆటంకంగా మారింది. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థినులు పరీక్షలు సమీపిస్తున్న వేళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లుగా పాఠశాలలో గణితం, సాంఘిక శాస్త్రం, తెలుగు, ఉర్దూ సబ్జెక్టులకు పూర్తిస్థాయి ఉపాధ్యాయులు లేకపోవడంతో తాము విద్యాపరంగా తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో నాలుగు నెలల్లో పదో తరగతి బోర్డు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని వారు కోరుతున్నారు. కీలకమైన సబ్జెక్టులకు బోధకులు లేకపోవడంతో సిలబస్ పూర్తికాక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థినుల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలికల పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ మేడమ్ వెంటనే తమ పాఠశాలను సందర్శించి సమస్యలను పరిశీలించాలని, ఉపాధ్యాయుల నియామకంతో పాటు ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ విద్యా భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నారు.