పేకాట స్థావరంపై పోలీసుల దాడి
గోదావరిఖని,(విజయక్రాంతి): గోదావరిఖనిలోని ఓ లాడ్జిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్, వన్‌టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1,36,130 నగదు, 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఐబీ కాలనీలో ఉన్న వినాయక్ రెసిడెన్సీ లాడ్జిలో డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ దీకొండ రమేష్‌తో పాటు సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్.ఎం. ఖాన్, టి. నర్సింగరావు, పి. తిరుపతి, ఎం. కుమార్, కె. కిరణ్, వి. సతీష్, ప్రవీణ్, ఆర్. మణి, ఎస్.కె. భాషి, కె. రాజ్‌కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లతో సహా నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా పేకాట, జూదం నిర్వహించినా, ఆడినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.