ఆత్మగౌరవ పోరాటానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తి
- భూమి, భుక్తి, హక్కుల కోసం ఆమె పోరాటం నేటి తరానికి ఆదర్శం
- మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీ కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, సెప్టెంబర్ 26(విజయ క్రాంతి) : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి, ఆత్మగౌరవానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sree Harsha) అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సంఘ సేవకురాలిగా, భూమి, భుక్తి, హక్కుల కోసం సాగించిన పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ, పోరాట పటిమ ఆమెను చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయని అన్నారు. దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితమే తెలంగాణ గడ్డపై దొరల నిరంకుశత్వం, అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని కలెక్టర్ పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి(Telangana Peasant Armed Struggle) స్ఫూర్తిగా నిలిచిన ఆమె, మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో పేదలు, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
సమాజ హితం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు, గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తోందని కలెక్టర్ తెలిపారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎం. రవీందర్, రజక సంఘ నాయకులు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.