నాణ్యమైన బొగ్గు సరఫరా చేయడం మన కర్తవ్యం
- బొగ్గు నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలి
- ఆర్జీ-3 ఏరియా ఎస్వోటు జీఎం ఎం.రామ్మోహన్
రామగిరి, నవంబర్ 12 (విజయక్రాంతి): వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ప్రతి సింగరేణి ఉద్యోగి తన బాధ్యతగా భావించాలని రామగుండం ఆర్జీ-3 ఏరియా(Ramagundam RG-3 Area) ఎస్వోటు జీఎం ఎం.రామ్మోహన్(S-Vote GM M. Rammohan)అన్నారు సింగరేణి వ్యాప్తంగా నవంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న బొగ్గు నాణ్యత వారోత్సవాలను గురువారం ఆర్జీ-3 ఏరియాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత జీఎం కార్యాలయ ఆవరణలో సింగరేణి నాణ్యత పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఉద్యోగుల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో నాణ్యత ప్రమాణాల ప్రతిజ్ఞ చేయించారు. సంస్థ అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్ర, దేశ పురోభివృద్ధికి నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి ద్వారా కృషి చేస్తామని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం ఎం.రామ్మోహన్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ మార్కెట్‌లో ఇతర బొగ్గు సంస్థలకు దీటుగా సింగరేణి తన నాణ్యత ప్రమాణాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందించినప్పుడే సంస్థపై పూర్తి విశ్వాసం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
నాణ్యత వారోత్సవాల సందర్భంగా ఏరియాలోని వివిధ గనులు, విభాగాల్లో సంబంధిత అధికారులు కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు ఎం.రామచంద్రారెడ్డి, కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం ప్రతినిధి బి.టి.మురళీకృష్ణ, ఏరియా భద్రతాధికారి జి.లక్ష్మీనారాయణ, నాణ్యత విభాగాధిపతి ఎం.డి.ఆసిఫ్ యాసిన్, విభాగాధిపతులు సి.జె.సురేఖ, అఫ్సర్ పాషా, ఐలయ్య, రాజా రవిచరణ్, ప్రశాంత్ జీవన్ తదితర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.