సముద్రంలో కొత్త అలజడి

12-11-2026 | 08:10am

మరో అల్పపీడనం రెడీ.. ఎటువైపు పయనం?

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల వాతావరణంలో మరోసారి మార్పులు చోటుచేసుకోనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 13 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త Low Pressure ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 14 నాటికి Well Marked Low Pressureగా, 15వ తేదీ నాటికి అదే ప్రాంతంలో Depressionగా బలపడవచ్చని అంచనా వేస్తోంది. అయితే ఈ వ్యవస్థ ఎటువైపు పయనిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం లేదని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.

మరోవైపు నవంబర్ 14, 15 తేదీల్లో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో బలమైన గాలులు, సముద్ర అలజడి ఉండే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈశాన్య దిశ నుంచి పొడి గాలులు వీస్తుండటంతో చాలా ప్రాంతాల్లో Dry Weather కొనసాగుతోంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం వేళల్లో చల్లని వాతావరణం, కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కనిపించే అవకాశం ఉంది. కొత్త అల్పపీడనం దిశ, తీవ్రత ఆధారంగా రానున్న రోజుల్లో వర్షాలపై మరింత స్పష్టత రానుంది.

ఇక తెలంగాణలో వర్షాల విషయానికి వస్తే.. తాజా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నవంబర్ 17 ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా Dry Weather కొనసాగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ సహా ప్రధాన జిల్లాల్లో ప్రస్తుతం ప్రత్యేక వర్ష సూచన లేదు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం దిశ, తీవ్రత ఆధారంగా తదుపరి రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఉండవచ్చు. అప్పటివరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడం, ఉదయం చలి, పొగమంచు కొనసాగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు