కొత్తచెరువు నాలాల పునరుద్ధరణకు రేపు ధర్నా
- అధికారుల నిర్లక్ష్యంతో వరద ముంపులో కాలనీలు.. ఇళ్ల ముందు మోకాళ్ల లోతు నీరు
- సర్వే పేరుతో కాలయాపన.. ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు ఏఐఎఫ్టీయూ న్యూ పిలుపు
రాజన్న సిరిసిల్ల 11 నవంబర్ (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణంలోని కబ్జాకు గురైన కొత్తచెరువు సహజ నాలాలను(Kottacheruvu Natural Drain) పునరుద్ధరించి, కబ్జాదారుల నుంచి వాటిని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఏఐఎఫ్టీయూ న్యూ ఆధ్వర్యంలో రేపు ఎమ్మార్వో కార్యాలయం(MRO Office) ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ సోమిశెట్టి దశరథం తెలిపారు.
కొత్తచెరువు నాలాల పునరుద్ధరణ కోసం ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్, సచివాలయంలోని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారుల్లో స్పందన లేదని విమర్శించారు. ఇటీవల ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినప్పటికీ రెవెన్యూ సర్వేయర్ అందుబాటులో లేకపోవడంతో సర్వే చేయకుండానే వెనుదిరిగారని తెలిపారు. శాఖల మధ్య సమన్వయలోపంతో సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కొత్తచెరువు నీరు సహజ నాలాల ద్వారా సర్వే నంబర్ 39 రోడ్డు మీదుగా మానేరు వాగులో కలిసేదని, ప్రస్తుతం నీటిని శ్రీనగర్ కాలనీ నుంచి కచ్చా కాలువ ద్వారా తుమ్మలకుంటకు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో కాలువలకు గండ్లు పడి ఇళ్లలోకి నీరు చేరుతోందని, కాలనీలు నీటమునిగి తుంగమడుగులుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల ముందు మోకాళ్ల లోతు నీరు నిలవడంతో విషపురుగులు, పాముల భయంతో చిన్నపిల్లలు బయటకు రాలేని దుస్థితి నెలకొందన్నారు.
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొత్తచెరువు పాత సహజ నాలాలను గతంలో ఉన్న విధంగా పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వరకు ఏఐఎఫ్టీయూ న్యూ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రజలు, వరద బాధితులు రేపటి ధర్నాలో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కొండ శ్యామ్, గుజ్జే దేవదాస్, పంతం సుజాత, కొనవేని భారత, గాజుల కళావతి, తడిగొప్పుల వజ్రవ్వతో పాటు వరద బాధిత మహిళలు పాల్గొన్నారు.