అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు
- మహిళా సిబ్బంది కోసం పరేడ్ గ్రౌండ్లో ఘనంగా ఏర్పాట్లు
- సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం, అక్టోబర్ 15(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు(Telangana culture and tradition) ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని(Police Commissionerate Headquarters) పరేడ్ గ్రౌండ్లో మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు.
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేక చొరవతో పరేడ్ గ్రౌండ్లో ఈ సంబరాలకు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలతో, నృత్యాలతో పరేడ్ గ్రౌండ్లో సందడి చేశారు.
ఈ వేడుకలకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శివకుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కుటుంబ సమేతంగా హాజరుకాగా, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సత్యనారాయణ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ... పండుగల వేళల్లో సాధారణ ప్రజల భద్రత కోసం పోలీసులు రేయింబవళ్లు బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నారు.
ముఖ్యంగా సద్దుల బతుకమ్మ రోజున సిబ్బంది విధుల్లో ఉంటారని, అందువల్ల మహిళా ఉద్యోగులు, సిబ్బంది కుటుంబాలు కూడా పండుగ ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించినట్లు తెలిపారు.
అనంతరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శివకుమార్ మాట్లాడుతూ... ప్రజలంతా ఇళ్లలో సురక్షితంగా, ప్రశాంతంగా పండుగలు జరుపుకుంటున్నారంటే దానికి కారణం పోలీస్ శాఖ నిరంతరం నిర్వహించే బందోబస్తు విధులేనని కొనియాడారు. పోలీసు సిబ్బంది సేవలను అభినందిస్తూ, అందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మహిళా అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.