కేటీపీపీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన మహిళలు
గణపురం,అక్టోబర్ 15 (విజయ క్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కేటీపీపీ చీఫ్ ఇంజనీర్ శ్రీ ప్రకాష్(KTPP Chief Engineer Sri Prakash) ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు.
కోలాటాలు, సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ శ్రీ ప్రకాష్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యత, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అన్నారు. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉద్యోగులు, వారి కుటుంబాల మధ్య ఆత్మీయతను పెంపొందిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కేటీపీపీ అధికారులు, ఉద్యోగులు, మహిళలు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కేటీపీపీలో పండుగ వాతావరణం నెలకొంది.