అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

22-10-2026 | 05:30am
  1. సైబరాబాద్ సీపీ డా.యం.రమేశ్
  2. జాతి సేవకు పునరంకితం కావాలి అమరవీరులకు ఘనంగా నివాళులు

శేరిలింగంపల్లి,అక్టోబర్21(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Police Commemoration Day) అక్టోబర్ 21, 2026 సందర్భంగా అమరవీరుల సేవలను స్మరిస్తూ సైబరాబాద్ సీపీ డా. యం. రమేశ్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని అమరవీరుల స్మారక స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ... వీరులారా& మీ త్యాగం వృథా కానివ్వం! మీ ఆశయాలను మా గుండెల్లో పదిలంగా నిలుపుకుంటాం! దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు మరణం లేదు, వారి త్యాగాలకు అంతం లేదు, వారి కీర్తికి చెరుపు లేదు! సరిహద్దులో సైనికుడి తుపాకీ గర్జన, సమాజంలో పోలీసు ధైర్యపు అడుగు...

ఇవే భారత భద్రతకు రెండు బలమైన స్తంభాలు! యూనిఫాం ధరించడం ఒక గౌరవం, ఆ యూనిఫాం గౌరవాన్ని కాపాడటం ఒక బాధ్యత, దేశం కోసం ప్రాణాలర్పించడం అత్యున్నత త్యాగం. వీరుల త్యాగం మనకు చరిత్ర, వారి ధైర్యం మనకు స్ఫూర్తి, వారి దేశభక్తి మనకు మార్గదర్శకం! అమరులైన, భారతమాత ముద్దుబిడ్డలారా, మీ సేవలకు శతకోటి వందనాలు!

మీ త్యాగాలకు యావత్ భారతజాతి రుణపడి ఉంటుంది. చివరిగా ఒక్క మాట, దేశం కోసం పోరాడిన వీరులను గౌరవిద్దాం, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుందాం, వారి కుటుంబాలకు అండగా నిలుద్దాం, మన దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడుదాం.ప్రజల కోసం పని చేసే పోలీసులకు సహకారం అందించేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు.

కొత్తగా పోలీసు బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్నవారికి విధి నిర్వహణలో స్ఫూర్తిని, నూతనోత్తేజాన్ని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశమన్నారు. పోలీసులు విధి నిర్వహణలో క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 154 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని జోహార్లు తెలిపారు.

వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అమరుల మరణం వారి కుటుంబసభ్యులకు తీరని లోటని, చనిపోయిన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. ప్రభుత్వం పోలీసు అమరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.

ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులు ఫహీముద్దీన్, కె. హన్మంత్ రెడ్డి, టి. ఈశ్వర్ రావు కుటుంబ సభ్యులను పోలీస్ కమిషనర్ గారు శాలువాలతో సత్కరించి, సమాజ శాంతిభద్రతల పరిరక్షణ కోసం అమరులైన పోలీసుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే డిపార్ట్మెంట్ పోలీసులు..

కాబట్టి పోలీసులకు ఎప్పుడూ సహకరించాలన్నారు. దేశంలోని టెర్రరిజం, ఎక్స్ట్రీమిజాన్ని అణచివేసి, శాంతి భద్రతలను కాపాడడం కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగాలను చేశారని గుర్తు చేశారు. 1959 ఇండో-చైనా సరిహద్దులో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు.

ఈ యుద్ధంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారన్నారు. అలాగే 1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారని తెలిపారు.అనంతరం, పోలీసు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీస్ అమరవీరులకు రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు.

ఆ తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి అందరూ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఈ సంవత్సరం అమరులైన వారి పేర్లను/రోల్ ఆఫ్ హానర్ను సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్ చదివారు.అనంతరం సైబరాబాద్ పోలీస్ సిబ్బంది, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో సీపీ డా. యం. రమేష్తో పాటు పలువురు అధికారులు,

సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థకు 87 యూనిట్లు, ఎన్టీఆర్ ట్రస్ట్కు 73 యూనిట్ల రక్తాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. యం. రమేష్, అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, కూకట్పల్లి డీసీపీ రితీరాజ్, క్రైమ్స్ డీసీపీ పుష్పా, శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి, వుమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, ఇతర ఉన్నత అధికారులు, హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ ఇన్ స్పెక్టర్లు, ట్రాఫిక్ సిబ్బంది, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు