రేషన్ బియ్యం స్కామ్
- పీడీఎస్ బియ్యానికే రంగులు, పాలిష్
- బ్రాండెడ్ బస్తాల్లో నింపి మార్కెట్లోకి..
- 26 కిలోల బస్తాలో వచ్చేది 24 కేజీలే..
- బియ్యం తూకాల్లో మాయాజాలం
- దగాపడుతున్న వినియోగదారులు
- ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్ రైస్ డిపోల్లో పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్, పోలీసుల దాడులు
- షాపులు మూసి పరారైన వ్యాపారులు
రంగారెడ్డి బ్యూరో/ఎల్బీనగర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ఎల్ నినో ఎఫెక్ట్ పేరుతో ఇప్పటికే బియ్యం ధరలు ఆకాశానికి అంటుతున్న వేళ ఇది చాలదన్నట్లు కొంతమంది వ్యాపారులు భారీగా అక్రమాలకు తెరలేపుతున్నారు. అక్రమ మార్గాలు పడుతున్న వ్యాపారులపై కొరడా ఝళిపించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) స్పష్టమైన ఆదేశాలివ్వడంతో ఇప్పుడు అలాంటి వ్యాపారుల దందా ఒక్కొక్కటిగా బయటపడుతున్నది. తాజాగా హైదరాబాద్‌లో భారీ రేషన్ బియ్యం స్కామ్(Ration Rice Scam) వెలుగు చూసింది.
రేషన్ బియ్యానికి పాలిష్ చేసి బయట మార్కెట్లో అమ్మేస్తున్న మాఫియాగుట్టురట్టయింది. పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్, పోలీసు అధికా రులు సంయుక్తంగా రంగంలోకి దిగి రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్‌ఘాట్‌లోని పలు రైస్ డిపో లపై గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కర్మన్‌ఘాట్ ప్రాం తంలోని రిటైల్, హోల్‌సేల్ రైస్ డిపోలలో విజిలెన్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎస్పీ రాముకుమార్, సిద్ధేశ్వరరావు, ఎల్బీనగర్ ఏసీపీ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో సుమారు 10 నుంచి 12 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు జరిపాయి. అధికారుల వాహనాలు రాగానే పలువురు అక్రమ వ్యాపారులు షాపులు మూసివేసి పరారయ్యారు.
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని మిల్లుల్లో రీ-సైక్లింగ్, పాలిష్ చేసి కార్పొరేట్ బ్రాండెడ్ సంచుల రూపంలో బహిరంగ మార్కెట్లో కిలో రూ. 80 నుంచి రూ. 100 వరకు విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. కర్మన్‌ఘాట్‌లోని శుభం ట్రేడర్స్, లక్ష్మీనరసింహ ట్రేడర్స్, కేఎల్ ట్రేడర్స్ తదితర డిపోల్లో అధికారులు క్షుణ్ణంగా సోదాలు చేసి బియ్యం నమూనాలను సేకరించారు. కనీస ట్రేడ్ లైసెన్స్ లేకుండానే అనేక డిపోలు నడుస్తున్నట్లు గుర్తించారు.
బియ్యం ప్యాకెట్లపై ముద్రించిన బరువుకు, లోపల ఉన్న వాస్తవ తూకానికి ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. 26 కిలోల బస్తాపై ముద్రించి ఉన్నప్పటికీ, తూకం వేస్తే కేవలం 24 నుంచి 25 కిలోలు మాత్రమే వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని బస్తాల్లో 20 నుంచి 30 గ్రాముల వరకు తక్కువగా ఉంచి వినియోగదారులను నిలువునా ముంచుతున్నారు. ప్యాక్ చేసిన బియ్యంపై జీఎస్టీ నిబంధనలు పాటించకపోవడం, వే- బిల్లులు, జీఎస్టీ పత్రాలు లేకపోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అధికారులు వస్తున్నారనే సమాచారం తో పలువురు వ్యాపారులు తమ దుకాణాలను మూ సివేసినట్లు పరారైనట్టు సమాచారం. అక్రమార్కులపై చర్యలు తప్పవు అని విజిలెన్స్ ఎస్పీ రాముకుమార్ హెచ్చరించారు.
కర్మన్‌ఘాట్ ప్రాం తంలో ఈ ఏడాదిలోనే 30కి పైగా దాడులు చేశామని, నిత్యావసర సరుకుల్లో కృత్రిమ కొరత సృష్టిం చి ఎక్కువ ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సన్నబియ్యం కొరత పేరిట వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత, పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి రీ-సైక్లింగ్ చేస్తున్న అక్రమాలపై ఈ నెల 26న ‘విజయక్రాంతి’ దినపత్రికలో ‘సన్న బియ్యం కొనలేం.. తినలేం!’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే.