చెత్తపై ఈటెలా? ఉత్త మాటలా?
- జవహర్నగర్ డంపింగ్ యార్డు సమస్యపై ఈటల పాదయాత్ర..
- సమస్య పరిష్కారమయ్యేనా? రాజకీయ ప్రయోజనమేనా?
- ఎన్నికలకు రెండేళ్ల ముందుగా పోరు‘బాట’పై చర్చోపచర్చలు
- డంప్ ముప్పు తొలగాలనేదే స్థానికుల ఆకాంక్ష
- ఫీజుల పోరాటంలా ఎత్తిన కాడి మధ్యలో దించొద్దనే అభిప్రాయాలు
- బీజేపీ ఎంపీలతో కేంద్రానికి సమస్యను వివరించాలని బాధితుల విన్నపం
- ఎలాగైనా డంప్ ఎత్తివేసేలా చూడాలని స్థానికుల అభిమతం
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్య మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) చేపట్టిన పాదయాత్రతో ఈ సమస్యపై ప్రజల్లో చర్చ మొదలైంది. డంపింగ్ యార్డుకు చుట్టుపక్కల సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
దుర్వాసన, తీవ్రంగా వాయు, జల, భూ కాలుష్యం, ప్రజల అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న ఈ ముప్పు నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు చాలాకాలంగా కోరుతున్నారు. ఎంపీ ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఈ సమస్య ఉండటంతో, దాని పరిష్కారంలో ఆయన బాధ్యత కూడా కీలకమే.
ప్రజల సమస్యలను గుర్తించి, వాటిపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పాదయాత్ర చేపట్టడం ఆహ్వానించదగిన పరిణామమే. తమ సమస్యలను పట్టించుకునే నాయకుడు ఉన్నారనే భావన ప్రజల్లో కలగడం కూడా ఈటలకు కలిసొచ్చేదే. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారమయ్యేంత వరకు పోరాటాన్ని ఆపబోనని ఈటల ప్రకటించడం ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అయితే.. పాదయాత్రతో చర్చకు దా రి తీసిన ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుం దా? ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా? అనే మరో ప్రశ్న ఎదురవుతోంది.
గతంలో మాదిరి కాదు కదా!
గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యపై బీజేపీ పోరాటానికి దిగింది. అందులో ఈటల కూడా ఉన్నారు. ఫీజుల సమస్య స మసిపోయేదాకా పోరాడతామని ప్రకటించారు. కానీ కాడిని మధ్యలోనే వదిలేశారు. దీంతో ఫీజుల సమస్య ఇంకా అపరిష్కృతంగానే మిగిలింది. అది అలా ఉండగా, జవహ ర్ నగర్ డంపింగ్ సమస్యను భుజానేసుకున్నారు. ఏకంగా ఈటలనే పోరు‘బాట’ పట్టారు. పోరాటం ప్రారంభించడం ఎంత ముఖ్యమో, దానిని లక్ష్యం చేరే వరకు కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. గతంలో ఫీజుల పోరాటంలా దీన్ని సైతం నీరుగార్చరు కదా! అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికలకు ఇంకా రెండేళ్లు!
ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేపట్టిన ఈటల పాదయాత్ర తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం కోసమా? లేక పార్టీకి మేలు కోసమా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది. ప్రజా సమస్యలపై రాజకీయ నాయకులు చొరవ చూపడం సహజం. అయితే, ఆ చొరవ ఎంతవరకు ఫలితాలను సాధిస్తుందన్నదే అసలు కొలమానం. పాదయాత్రతో ప్రజల్లో చైతన్యం పెంచడం మొదటి అడుగు మాత్రమే. ఆ తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, నిధులు సమీకరించడం, అధికారులతో సమన్వయం సాధించడం, పనులు ప్రారంభమయ్యేలా చూడటం వంటి చర్యలు చేపట్టాలి. అలా జరిగినప్పుడే పాదయాత్రకు రాజకీయ ప్రచారానికి మించిన ప్రజా ప్రయోజనం చేకూరుతుంది.
పార్టీ ఎంపీలను కలుపుకుని..
తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. అందులో కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఇంతటి రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నప్పుడు జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి సమిష్టి కృషి అవసరం. ఈటల ఒక్కరే పోరాటం చేయడం కంటే, సొంత పార్టీ ఎంపీలను కలుపుకొని ముందుకు సాగాలి. రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చ జరపాలి. అవసరమైతే.. తెలంగాణకు చెందిన ఎంపీలందరినీ సమన్వయం చేసుకోవాలి. కేంద్రం దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్లాలి. పరిష్కారానికి కృషి చేయాలి.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి!
ప్రజా సమస్యపై ఉద్యమం నాయకత్వ లక్షణం కావచ్చు. కానీ, ఆ సమస్యకు పరిష్కారం చూపించడం సమర్థతకు నిదర్శనం. పాదయాత్రలో ప్రజల బాధలను వినడం ఎంత ముఖ్యమో, వాటిని తగ్గించే చర్యలు కూడా అంతే ముఖ్యం. జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్య ఈటలకు ఒక రాజకీయ అవకాశమా, ప్రజా నాయకుడిగా తన నిబద్ధతను నిరూపించుకునే పరీక్షా అన్నది ఆయన తదుపరి చర్యలే నిర్ణయిస్తాయనే వాదనలు స్థానికంగా వినిపిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడనేది పక్కనపెడితే, ప్రజారోగ్య సమస్య తక్షణం పరిష్కరించాల్సిన అంశం.
అందులో రెండో అభిప్రాయానికి తావులేదు. పాదయాత్రతో ప్రజల్లో చైతన్యం కలిగించవచ్చు. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచవచ్చు. కా నీ, కాలుష్యాన్ని తొలగించడానికి యంత్రాలు కావాలి, శాస్త్రీయ సాంకేతికత కావాలి, నిధులు కావాలి, నిరంతర పర్యవేక్షణ కావాలి. వీటన్నింటినీ ఎలా సాధిస్తారన్నదే ఇప్పుడు కీలకం. ప్రజలు కోరుకునేది పాదయాత్రలు కాదు.. తమ సమస్యకు పరిష్కారం. హామీల కంటే ఫలితాలు ముఖ్యం. పోరాట ప్రకటనల కంటే పోరాటం చివరి వరకు కొనసాగడం ముఖ్యం. జవహర్నగర్ ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి లభించినప్పుడే ఈ పాదయాత్రకు నిజమైన అర్థం, ఈటల రాజేందర్ పోరాటానికి నిజమైన గుర్తింపు లభిస్తాయి.