బ్యాలెట్‌తో బీజేపీకి బుల్లెట్ దింపాం
- ప్రధాని మోదీ అడ్డాలోనే ఓడించాం
- ఆర్‌ఎస్‌ఎస్ గడ్డపైనా కాంగ్రెస్ జెండా
- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచామన్నది ముఖ్యం కాదు.. ఎక్కడ గెలిచామన్నదే అత్యంత కీలకమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar) స్పష్టం చేశారు. బ్యాలెట్ ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బుల్లెట్ దింపామని వ్యాఖ్యానించా రు. ప్రధాని నరేంద్రమోదీ సొంత నియోజకవర్గమైన వారణాసితో పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌లోనూ బీజేపీని ఓడించామని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందంటూ మోదీ చేసిన వ్యంగ్య ట్వీట్‌పై ఆయన ఈ మేరకు స్పందించారు. విలేకరులు ముఖాముఖిగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం ప్రధాని మోదీకి లేదని, అందుకే ఆయన సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితమవుతున్నారని పీసీసీ చీఫ్ విమర్శించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే అది ప్రభుత్వ వ్యతిరేకత అని బీజేపీ ప్రచారం చేస్తోంది.
మరి వారణాసిలో ఆ పార్టీ వెనుకబడితే అది ప్రధాని మోదీ పాలనకు వ్యతిరేకం కాదా?.. బీజేపీకి కర్ణాటకలో ఒక నీతి, వారణాసిలో మరో నీతా?’ అని నిలదీశారు. బీజేపీ సొంత సిద్ధాంతాల పురిటిగడ్డ అయిన నాగపూర్‌లోనే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. దేశంలోని యువత, విద్యావంతుల్లో మోదీ పాలనపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని విమర్శించారు. లక్నో నుంచి పాట్నా వరకు బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత ప్రాంతమైన గోరఖ్‌పూర్‌లో బీజేపీ కేవలం 307 ఓట్ల స్వల్ప మెజారిటీతో మాత్రమే గట్టెక్కిందని గుర్తుచేశారు.
బీజేపీ అగ్రనేతల సొంత నియోజకవర్గాల్లోనే ఆ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వస్తోందని స్పష్టం చేశారు. మోదీ ప్రధానమంత్రిగా పదవీకాలం 12 ఏళ్లు దాటుతున్నా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా అధికారిక మీడియా సమావేశం పెట్టలేదని, కేవలం సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు చేస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కనీసం మూడు అంకెల (100 స్థానాలు) సీట్లు కూడా రావని పేర్కొన్నారు.
సర్’తో దేశంలో అలజడి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తో దేశంలో బీజేపీ అలజడి సృష్టించిందని పీసీసీ చీఫ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ‘ఓట్ చోరీ’ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి రాష్ట్రం నుంచి భారీగా తరలివెళ్లనున్నట్లు తెలిపారు. ర్యాలీకి పార్టీ శ్రేణులను తరలించకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుందని మండిపడ్డారు. ప్రత్యేక రైళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే కుంటిసాకుల చూపి నిరాకరించిందని మండిపడ్డారు.
అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై సీరియస్
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ సీరియస్ అయ్యారు. ఒక్క జడ్చర్లలోనే బిల్లులు చెల్లించలేదనడం సరికాదని, రాష్ట్రంలో చాలా చోట్ల నిధుల కొరత ఉందన్నారు.