పంటలు ఎండుతుంటే మూసీకి ముస్తాబా
- కాంగ్రెస్ సర్కారుకు హాలిడే ఇస్తే దరిద్రం పోతది!
- డీపీఆర్ లేకుండానే లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్
- అది గ్లోబల్ సమ్మిట్ కాదు గోబెల్స్ సమ్మిట్
- కరెంటు, నీళ్లు లేవని పెట్టుబడిదారులకు చెబుతారా?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): 420 హామీలకు హాలిడే.. ఆరు గ్యారెంటీలకు హాలిడే.. క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, పీఆర్సీకి హాలిడే, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు హాలిడే.. ఇలా అన్నింటికీ హాలిడే ప్రకటించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే మనం హాలిడే ఇస్తే దరిద్రం పోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడేమో రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరే షన్లు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పంటలు తామే కాపాడుకుంటామని రైతులు పత్రాలపై రాసి వ్వాల్సిన దుస్థితి నేడు తెలంగాణలో నెలకొందని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడి యాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు వల్ల జనరేటర్లు, ట్యాంకర్ల ద్వారా నీటిని పారించి పంటలను కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. పంటలకు నీళ్లు, సరిపడ కరెంట్ లేక పంటలనే తగలబెట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్ల కోసం రైతులు, కరెంట్ కోసం పరిశ్రమలు, హక్కుల కోసం ఉద్యోగులు ఎదురుచూసే అగత్యం ఏర్పడిందన్నారు. రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకునే పరిస్థితి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని, రైతుబంధు విడుదల చేయాలని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, విద్యుత్ కోతలను నివారించాలని డిమాండ్ చేశారు.
పంటలు ఎండిపోతుంటే..?
సాగునీళ్లు లేక, కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి డీపీఆర్ లేకపోయినా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పు పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారని ఆరోపించారు. మూసీ ముస్తాబు డ్రామాలను బంద్ చేయాలని సూచించారు. ఎలాంటి నివేదికలు, ప్రజల అంగీకారం లేకుండా నరకయాతనకు గురిచేస్తూ, హాలిడేల పేరుతో వారి జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టిన కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి తదితరులు కమీషన్లతో జాలీడేస్ గడుపుతున్నారని విమర్శించారు.
కరువు ఛాయలు, తాగునీటి కష్టాలను కాదని, లక్షన్నర కోట్లతో మూసీ పనులకు టెండర్లు పిలవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టును నిలిపివేసి ఆ లక్షన్నర కోట్లతో ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణకు అడ్డుపడడం, బాధితుల గొంతులను అణిచివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. మూసీ బాధితులు, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు.
కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు..
రాష్ట్రంలో వర్షాలు లేక, కరువు పరిస్థితులు నెలకొని రైతాంగం అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు నిధులు పూర్తి స్థాయిలో అందకపోవడం, రైతు బీమా పథకం నిలిచిపోవడం, పెన్షన్లు, నిరుద్యోగ భృతి అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కరువు పరిస్థితుల్లో అల్లాడుతున్న రైతాంగానికి ఇప్పటివరకు ఎగ్గొట్టిన రైతుబంధు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు.
వ్యవసాయం చేసుకుంటే మీ కర్మ అనేలా కాంగ్రెస్ పాలన ఉందని విమర్శించారు. మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగి మూడేండ్లవుతున్నా, ఏ విచారణ జరపకుండా, ఏ పని చేపట్టకుండా కేవలం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువేనని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ కరువు పరిస్థితుల్లోనూ జలాశయాలను నింపుకొని రైతులను ఆదుకున్నదని, ఈ విషయంలో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబును అభినందించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ప్రకటించడం వల్ల పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్ కోతలతో ఇండస్ట్రీలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు.. కరెంట్ ఉంటే కాంగ్రెస్ ఉండదనేది నిజమవుతోందని ఎద్దేవా చేశారు.
అది గోబెల్స్ సమ్మిట్..
రాష్ట్రం రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత అవినీతి, కరువు కాటకాలు, పరిపాలనా వైఫల్యం ఉన్నప్పటికీ ఇప్పటిదాకా ఆయన స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్రం కరువు, కరెంట్ కోతలతో తల్లడిల్లుతుంటే గ్లోబల్ సమ్మిట్ పేరుతో గోబెల్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు పొదుపు మంత్రం పాటించాలని చెబుతూ, వందల కోట్ల రూపాయలు ప్రచారం కోసం, ఫ్లెక్సీల కోసం, ప్రకటనల కోసం దుబారా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త పెట్టుబడి, కొత్త ఉద్యోగం తీసుకురాలేకపోయిందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని స్వయంగా ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. తాము దిగిపోయేనాటికి 9,46,000గా ఉన్న ఐటీ ఉద్యోగాలు.. కాంగ్రె స్ సర్కారు వచ్చాక 7,000 వరకు తగ్గాయని ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు. గతంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వల్ల ఒక్క పెట్టుబడి, ఒక్క ఉద్యోగం రాలేదని, అందుకే అది ’గోబెల్స్ సమ్మిట్’ అని విమర్శించారు. రాష్ట్రంలో కరెంట్ లేదని, నీళ్లు లేవని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని పెట్టుబడిదారులకు చెబుతారా? అని ప్రశ్నించారు. పవర్ హాలిడే ఇచ్చే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారని నిలదీశారు.
ఈ మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విదేశీ పర్యటనలు, ప్రకటించిన ఎంఓయూలు, వచ్చిన పెట్టుబడులు, కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలెన్నో వివరాలతో వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో చేస్తున్న ప్రచారానికి, వాస్తవంగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరించాలని కోరారు. గతంలో తాము ఎలాంటి గ్లోబల్ సమ్మిట్లు పెట్టకుండానే పదేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు తేగలిగామని కేటీఆర్ వెల్లడించారు. పెట్టుబడులు, ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.