మల్లన్న సాగర్‌పై బ్లాస్టింగ్ కుట్ర
- 150 మీటర్ల దూరంలోనే అర్ధరాత్రి పేలుళ్లు
- తిప్పారంలో ఇండ్లు బీటలు వారుతున్నాయి
- పేలుళ్ల దాటికి కట్ట నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి
- కట్ట భద్రతతో చెలగాటమా?
- బ్లాస్టింగ్స్ ఆపి, బాధ్యులపై కేసులు పెట్టాలి
- మాజీ మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్/కొండపాక, అక్టోబర్ 29 (విజయక్రాంతి): మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు(Former Minister Harish Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. మూసీ సుందరీకరణకు నీటిని తరలించేందుకు పైప్లైన్లు, పంప్‌హౌస్ నిర్మాణం పేరుతో రిజర్వాయర్ కట్టకు కేవలం 150 మీటర్ల దూరంలోనే అనుమతులు లేకుండా అర్ధరాత్రి భారీ బ్లాస్టింగ్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
తిప్పారం గ్రామస్థుల ఫిర్యాదుతో గురువారం మల్లన్న సాగర్ కట్టను, పేలుళ్లు జరుగుతున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. కట్ట ఎత్తు 40 మీటర్లు కాగా, నిబంధనల ప్రకారం 400 మీటర్ల పరిధిలో బ్లాస్టింగ్స్ చేయకూడదని, అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి పేలుళ్లు జరుపుతున్నారని ఆరోపించారు. గత రెండు, మూడు నెలలుగా 16 నుంచి 20 మీటర్ల లోతులో తవ్వకాలు చేపట్టి భారీ బండరాళ్లను పేల్చివేస్తున్నారని తెలిపారు.
పేలుళ్ల ధాటికి కిలోమీటరు దూరంలోని తిప్పారం గ్రామంలో ఇండ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయని, కట్ట సమీపంలో సీపేజీ పెరిగిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేళుళ్ల కు అనుమతులపై పోలీస్, రెవెన్యూ అధికారుల వద్ద స్పష్టత లేదని, పనులు నిలిపివేయాలని ఇరిగేషన్ అధికారులు జలమండలికి లేఖ రాసినా పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. ఇంతటి భారీ పేలుళ్లు ఎవరి అండతో జరుగుతున్నాయని ప్రశ్నించారు.
మల్లన్న సాగర్ భద్రతపై నిపుణులైన ఇంజినీర్లతో తక్షణమే పరిశీలన జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సుమారు 60 ఎకరాల భూసేకరణలో దళిత అసైన్డ్ రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అర్హులైన రైతులందరికీ న్యాయం చేసి, ఎకరాకు కనీసం రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిహారంపై పునఃసమీక్ష చేయకపోతే రైతుల పక్షాన ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు బహిరంగ లేఖ రాస్తున్నట్లు హరీశ్‌రావు వెల్లడించారు. అక్రమ బ్లాస్టింగును వెంటనే నిలిపివేయాలని, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని, సంబంధిత కాంట్రాక్టర్, ఏజెన్సీపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పేలుళ్లతో దెబ్బతిన్న ఇం డ్లకు నష్టపరిహారం చెల్లించి బాధితులకు న్యా యం చేయాలని కోరారు. మల్లన్న సాగర్ క ట్టకు నష్టం జరిగితే జలమండలి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయన వెంట దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, బక్కి వెంకటయ్య ఉన్నారు.