సబ్‌ప్లాన్ నిధులు వినియోగించాలి

30-10-2026 | 05:20am
  1. ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ ఫలాలు అందాలి
  2. లక్షిత వర్గాలకు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చండి
  3. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
  4. ప్రత్యేక నిధుల ఖర్చుపై శాఖల వారీగా సమీక్ష 

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ఎస్పీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల ద్వారా లక్షిత వర్గాలకు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చడంతో పాటు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలని సూచించారు. వ్యవసాయం, విద్యుత్, గృహ వసతి, సామాజిక మౌలిక సదుపాయాలు, వైద్య సేవలు వంటి కీలక రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

సచివాలయంలో గురువారం వ్యవసాయ, ఇంధన, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ రైతులకు వర్తించే పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను సమగ్రంగా విశ్లేషించాలని ఆదేశించారు.

భూమి యాజమాన్యం ఆధారంగా అమలవుతున్న పథకాల కారణంగా ప్రత్యేక అభివృద్ధి నిధుల వినియోగంలో ఏర్పడుతున్న వ్యత్యాసాలను గుర్తించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వ్యవసాయ పథకాల ద్వారా అందుతున్న సహాయం, సాధారణ పథకాల వ్యయంతో పోలిస్తే ఎంత మేరకు ఉందో స్పష్టమైన గణాంకాలతో నివేదికలు రూపొందించాలని పేర్కొన్నారు. సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ యంత్రాల పంపిణీ వంటి పథకాల్లో లబ్ధి పొందిన రైతుల పేర్లు, గ్రామాలు, సామాజిక వర్గాలు, అందించిన సహాయం తదితర వివరాలతో  జాబితాలు సిద్ధం చేయాలని  స్పష్టం చేశారు. 

వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయాలని ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో సుమారు 1,300 ఎకరాల మేర ఖాళీగా భూములు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించగా.. అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని అధికారులను భట్టి ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన స్థలాలను అర్హులైన కుటుంబాలకు అందించేందుకు అవసరమైన అనుమతులు, తదుపరి చర్యలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

అర్హులైన కుటుంబాలకు ఇండ్ల స్థలాల కోసం పంపిణీ చేసే అవకాశాలను పరిశీలించాలని, ప్రతి నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్లు, శ్మశానవాటికలు ఇతర మౌలిక సదుపాయాల అవసరాలను గుర్తించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు,  విద్యుత్ సదుపాయాల మెరుగుదల కు చర్యలు చేపట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూచించారు.   సమావేశంలో ఉన్నత అధికారులు నవీన్ మిట్టల్, సందీప్ కుమార్ సుల్తానియా, సురేంద్రమోహన్, సిక్తా పట్నాయక్, క్రిస్టినా, విజయేంద్ర బోయి, గోపి, గుగులోతు రవి నాయక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 


మరిన్ని వార్తలు