సొసైటీ భూములపై రాబందుల హస్తం?

30-10-2026 | 05:15am
  1. అమీన్‌ఫూర్ ల్యాండ్ స్కామ్‌లో పెద్దల భాగోతం
  2. ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ భూముల్లో కుంభకోణం
  3. నాలుగు దశాబ్దాల నిరీక్షణ
  4. వేలాది మంది కార్మికుల కలలపై నీళ్లు
  5. తెర వెనుక రెవెన్యూ అధికారులు, బడా బాబుల కుట్ర!
  6. హైకోర్టు మొట్టికాయ వేసినా స్పందించని అధికారులు
  7. ఎట్టకేలకు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సంగారెడ్డి కలెక్టర్

సంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి)/ అమీన్‌పూర్: నాలుగు దశాబ్దాల క్రితం చెమటోడ్చి కొన్న భూమి.. నేడు వేల కోట్ల విలువైన ఐటీ కారిడార్‌గా మారింది. కానీ ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకోవాల్సిన కార్మికుడి చేతిలో మాత్రం కోర్టు నోటీసులు, కన్నీళ్లే మిగిలాయి. సంగారెడ్డి(Sangareddy) జిల్లా అమీన్‌పూర్ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ సొసైటీ భూముల వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక సివిల్ వివాదం కాదు.. కొందరు అవినీతి అధికారులు, బడా రియల్ మాఫియా కలిసి సామాన్యుడి సొంతింటి కలపై చేసిన అతిపెద్ద ల్యాండ్ సర్జరీ.

వేలాది ఎకరాల కార్మికుల పట్టాలను రాత్రికి రాత్రే మాయం చేసిన ఆ తెరవెనుక సూత్రధారులెవరు? 1980లో సుమారు 1,286 ఎకరాల విస్తీర్ణంలో మొదలైన ఈ ల్యాండ్ అలాట్మెంట్ కథ, నేడు వేలాది మంది బాధితుల రోధనగా, కోర్టుల చుట్టూ తిరిగే సివిల్ వివాదంగా రూపాంతరం చెందింది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? వేల కోట్ల విలువైన కార్మికుల భూములను ఎవరు కబ్జా చేశారు?  అనేది ప్రస్తుత జిల్లా కలెక్టర్ తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంది. 

మలుపు తిప్పిన 2006 పరిణామాలు

1980లో వి నారాయణరావు అధ్యక్షతన పారిశ్రామిక కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఈ సొసైటీ రిజిస్టర్ అయింది. అమీన్‌పూర్, తెల్లాపూర్, కొల్లూరు, పటాన్‌చెరు పరిధిలో సుమారు 1,286 ఎకరాల పట్టా, అసైన్డ్ భూములను సొసైటీ సేకరించింది. సుమారు 5 వేల నుంచి 8,500 మంది సభ్యులకు 300, 400, 500 గజాల చొప్పున ప్లాట్లు చేసి, రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేశారు. ఆ సమయంలో ఇవన్నీ రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూములుగానే నమోదయ్యాయి.

కార్మికులు ఇళ్లు కట్టుకుందాం అనుకునే లోపే, భూముల ధరలు పెరగడంతో రియల్ మాఫియా కన్ను దీనిపై పడింది. 2006లో సొసైటీలో అక్రమాలు జరిగాయనే సాకుతో అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ ఈ భూములను డీఆర్వో ఆధీనంలోకి తీసుకుంటూ జీవో ఎంఎస్ నంబర్ 1077 ద్వారా ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ స్థలాల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించారు. రెవెన్యూ అధికారుల పరిధిలోకి వెళ్లిన తర్వాత ఈ సొసైటీ స్థలాల్లో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరిగాయని, దీనివల్ల వేలాది మంది అసలైన ప్లాట్ల యజమానులు నష్టపోయారని సొసైటీ సభ్యులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై హైకోర్టు కూడా గతంలో ప్రభుత్వానికి, కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ భూముల్లో కొందరు అవినీతి రెవెన్యూ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు చేతులు కలిపి అసలైన సొసైటీ రికార్డులను మాయం చేసినట్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సామాన్య కార్మికుల భూములను అక్రమంగా ఇతరులకు అప్పగించడం, ఒకే ప్లాట్‌ను పలువురికి అమ్మడం, వివాదాల్లో ఉన్న భూములను బడా బిల్డర్లకు కట్టబెట్టడం వంటి ల్యాండ్ గ్రాబింగ్ చట్ట వ్యతిరేక చర్యలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 

రియల్ ఎస్టేట్ మాఫియా అక్రమాలు

భూముల ధరలు వందల కోట్లకు చేరడ ంతో సామాన్య కార్మికులను రోడ్డున పడేస్తూ రియల్ ఎస్టేట్ మాఫియా పక్కా వ్యూహంతో అక్రమాలకు తెరలేపింది. సొసైటీకి చెందిన అసలైన లేఅవుట్‌ను పక్కనబెట్టి, నకిలీ ఎల్‌ఆర్‌ఎస్,  నకిలీ డిమాండ్ డ్రాఫ్టులను సృష్టించి సమాంతరంగా వేరే లేఅవుట్లను సృష్టించింది. కార్మికులకు ఇప్పటికే రిజిస్టర్ అయిన ప్లాట్లను, వారు అక్కడ లేని సమయాన్ని చూసి నకిలీ పత్రాలతో బడా రియల్ ఎస్టేట్ బిల్డర్లకు, ప్రైవేట్ వ్యక్తులకు దొంగచాటుగా మళ్లీ రిజిస్ట్రేషన్ చేశారు. ఒకే ప్లాట్ నంబర్‌పై ముగ్గురు, నలుగురికి డాక్యుమెంట్లు సృష్టించడం వల్ల తీవ్రమైన సివిల్ వివాదాలు రేగాయి. సొసైటీ సేకరించిన భూము ల్లో కొన్ని ప్రభుత్వ పట్టా భూము లు, కొన్ని అసైన్డ్ భూములు ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, ప్రభుత్వం జారీ చేసిన నిషేధిత ఉత్తర్వులను తమకు అనుకూలంగా వాడుకుని ల్యాండ్ గ్రాబింగ్‌కు పాల్పడ్డారు.

కోర్టు గుమ్మం తొక్కిన కార్మికులు

తమ జీవితకాల పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి ప్లాట్లు కొన్న సుమారు 5 వేల మంది కార్మికులు గడిచిన 20 ఏళ్లుగా ఇల్లు కట్టుకోలేక, ప్లాట్ అమ్ముకోలేక నరకం చూస్తున్నారు. ఇటీవలే ఈ భూ అక్రమాలపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి, బాధ్యులైన అధికారుల తీరుపై మండిపడింది. అంతేగాకుండా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వా న్ని ఆదేశించింది. కొన్ని పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు కోర్టు పచ్చజెండా ఊపినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా అనేక సర్వే నెంబర్లలో మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కబ్జాదారుల భారి నుండి మా సొసైటీ భూములను కాపాడి, అసలైన లేఅవుట్ ప్రకారం మా ప్లాట్లను మాకు అప్పగించేలా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా న్యాయం చేయాలని ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ముక్తకంఠంతో కోరుతున్నాయి. 

అధికారుల మౌనానికి కారణమేమిటి?

భూముల రికార్డులు, పట్టాలు, నిర్మాణ అనుమతులను పరిశీలించి, ఆక్రమణలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. 2014లో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించాలని సొసైటీ సభ్యులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అప్పటి జిల్లా కలెక్టర్ నుండి కిందిస్థాయి అధికారుల వరకు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపానపోలేదు. ఈ భూ కుంభకోణంలో కిందిస్థాయి అధికారుల నుండి ఉన్నతాధికారుల వరకు హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు అధికారులు ఎందుకు స్పందించలేదు? భూముల వ్యవహారంలో జాప్యానికి కారణాలేమిటి? అన్న అంశాలపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 

కదిలిన కలెక్టర్... క్షేత్రస్థాయి పరిశీలన

అమీన్‌పూర్ మండల పరిధిలోని ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ సొసైటీ లేఅవుట్లు, ఓ పెన్ స్థలాలు, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూ ముల సరిహద్దులను గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వయంగా పరిశీలించారు. సొసైటీ పరిధిలోని భూములు ఏవైనా కబ్జాలకు గురయ్యాయా? ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న స్థలాల్లో ఎలాంటి ని ర్మాణాలు జరిగాయి? అనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూములకు సంబంధించిన పాత రెవెన్యూ రికార్డులను, లిటిగేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని అక్కడికక్కడే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తాజా పరిశీలనతోనైనా భూముల హద్దులు తేలి, సొసైటీ సభ్యులకు న్యాయం జరుగుతుందా? ఆక్రమణల ఆరోపణలపై చర్యలు ప్రారంభమవుతాయా? లేక సమస్య మళ్లీ ఫైళ్లకే పరిమితమవుతుందా? అన్నది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు