ఆ డీపీఆర్ ఇస్తే నిధులు తెస్తా
- జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించండి
- అది కాకుండా మూసీ ప్రక్షాళన ఎలా చేస్తారు?
- ఎంపీ ఈటెల రాజేందర్
- మూడో రోజు కొనసాగిన జన సంకల్పన యాత్ర
మేడ్చల్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ యార్డ్(Jawahar Nagar Dumping Yard) సమస్య శాశ్వత పరిష్కారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ తయారుచేసి ఇస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తనదని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈటల చేపట్టిన జన సంకల్పన యాత్ర మూడవ రోజు కీసర మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా కీసరలో ఆయన మాట్లాడుతూ.. తాను ఇదివరకే కేంద్రమంత్రితో మాట్లాడానని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్ తేవాలని సూచించారని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఇస్తే కేంద్రం నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా తెస్తానన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల లక్షలాదిమంది ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. డంపింగ్ యార్డ్ సమస్య కేవలం డబ్బుల కోణంలో కాకుండా, ప్రజారోగ్య కోణంలో చూడాలన్నారు. లిచ్చట్ నీటితో చెరువులు కలుషితమవుతున్నాయని, బోరు బావుల్లో రంగు మారిన నీరు వస్తోందని పేర్కొన్నారు.
చెరువులు కలుషితం కావడం వల్ల వాటి మీద ఆధారపడిన వివిధ కుల వృత్తులు మత్స్యకారులు, రజకులు, యాదవులు, రైతులు ఉపాధి కోల్పోయారు అన్నారు. డంపింగ్ యార్డ్ నిర్వహణలో రాంకీ సంస్థ పూర్తిగా విఫలమైందని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. చెత్త నుంచి విద్యుత్తు, ఎరువు తదితర ఉత్పత్తులు తయారు చేసే అవకాశం ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో చేయడం లేదన్నారు. ఆధునిక సాంకేతికత ఉపయోగిస్తే ఒక్క గ్రామ చెత్త కూడా వృధా కాకుండా రీసైక్లింగ్ చేయవచ్చు అన్నారు.
మూసి ప్రక్షాళన ఎలా చేస్తారు?
2 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి డంపింగ్ యార్డ్ తొలగించలేని సీఎం రేవంత్‌రెడ్డి.. లక్ష కోట్లు ఖర్చు చేసి మూసి ప్రక్షాళన ఎలా చేస్తారని ఈటల ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుక అని గతంలో ఎంపీగా గెలిపిస్తే ప్రజా సమస్యలను పట్టించుకోని సీఎంను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. స్థానిక ప్రజలు ఇచ్చిన ఎంపీ పదవిని ఉన్నత పదవులు పొందడానికి నిచ్చెనగ వాడుకున్నారని విమర్శించారు. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారమయ్యే వరకు తన పోరాటం ఆగబోదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇతరుల మీద నింద వేయడానికి చేయడం లేదని, డంపింగ్ యార్డ్ శాశ్వత పరిష్కారం ఉందని భావించిన తర్వాతే పాదయాత్ర మొదలు పెట్టానని ఆయన తెలిపారు.
తన పోరాటంలో బాధితులందరూ భాగస్వాములు కావాలని, ఈ నెల 30న జవహర్ నగర్లో జరిగే భారీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ పాదయాత్రకు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య సంఘీభావం తెలిపారు. పాదయాత్ర ఉదయం కీసర నుంచి ప్రారంభమై నాగారం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్, సీనియర్ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి, కౌకుట్ల చంద్రారెడ్డి, జిల్లెల తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.