ఆ 550 ఎకరాలు ప్రభుత్వానివే!
- మియాపూర్ భూముల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ప్రైవేట్ వ్యక్తుల అప్పీళ్లు కొట్టివేత
- హైకోర్టు తీర్పునకు సమర్దన
- 23 ఏళ్ల న్యాయపోరాటానికి తెర
- సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ.. ప్రభుత్వం చారిత్రక విజయం
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): మియాపూర్ భూముల వివాదం(Miyapur Land Dispute)లో తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101కు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
సుమారు 550 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూములపై హక్కులు కోరుతూ ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను (సివిల్ అప్పీల్ నెం.10699/2013 తదితర కేసులు) సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్(Justice M.M. Sundaresh), జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. దీంతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి ముగింపు లభించింది.
పక్కా ఆధారాలతో సుప్రీంకోర్టులో వాదనలు
మియాపూర్ సర్వే నంబర్ 100లో 277 ఎకరాల 5 గుంటలు, సర్వే నంబర్ 101లో 273 ఎకరాల 34 గుంటల భూమి ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. ఈ భూములపై హక్కులు కోరుతూ ప్రైవేట్ వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ కేసుల్లో 1997లో ప్రత్యేక న్యాయస్థానం, 2003లో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి దాదాపు 23 ఏళ్లుగా ఈ కేసు పెండింగ్లో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఈ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు న్యాయపరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ప్రత్యేక పర్యవేక్షణలో ప్రభుత్వ యంత్రాంగం, న్యాయ నిపుణుల మధ్య సమన్వయం పెంచి సుప్రీంకోర్టులో కేసుల విచారణకు అవసరమైన చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ పక్షాన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సమర్థవంతమైన వాదనలు వినిపించారు. మియాపూర్ భూము లు ప్రభుత్వానికే చెందుతాయని స్పష్టం చేసే పాత రెవెన్యూ రికార్డులు, సేత్వార్, క్లాసర్ రిజిస్టర్, గత న్యాయస్థానాల తీర్పులను ప్రభుత్వం తరఫున ఆధారాలుగా సమర్పించారు. ప్రైవేట్ వ్యక్తులు హక్కులు కోరుతూ చూపిన రెవెన్యూ ఎంట్రీల్లో అవకతవకలు ఉన్నాయని గత న్యాయస్థానాలు గుర్తించిన అంశాలను ప్రభుత్వ వాదనల్లో ప్రస్తావించారు. ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనల అనంతరం సుప్రీంకోర్టు ప్రైవేట్ వ్యక్తుల అప్పీళ్లను కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కీలక విజయం లభించింది.