తెలంగాణ లక్ష్యాన్ని అభినందిస్తున్నా
- రాష్ట్రం నుంచి ఆస్ట్రేలియాకు తాండూరు కందిపప్పు ఎగుమతి
- నిజామాబాద్ పసుపుకు మంచి డిమాండ్
- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ నిర్దేశించుకున్న తెలంగాణ రైజింగ్- 2047’ లక్ష్యాన్ని అభినందిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. లక్ష్య సవాలుతో కూడుకున్నదే అయినా సమష్టి కృషితో సాధించొచ్చని పేర్కొన్నారు. రాష్ట్రం లో ఫార్మా, అంతరిక్షం, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, ఆహార శుద్ధి, పరిశోధన, ఆవిష్క రణలరంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - కర్టెన్ రైజర్ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పెట్టుబడులు పెట్టే ముందు పారిశ్రామికవేత్తలు ప్రధానంగా ఆశించేది విధానాల్లో స్థిరత్వం, నిబంధనల్లో స్పష్టత, వ్యాపార నిర్వహణలో పారదర్శకతేనని పేర్కొన్నారు. ఇందుకు కాకతీయుల కాలం నాటి ఉదాహరణను ప్రస్తావించారు. క్రీ.శ. 1244లో గణపతిదేవుడు మోటుపల్లి ఓడరేవులో జారీ చేసిన అభయ శాసనం సముద్ర వాణిజ్యంలో కీలక సంస్కరణలకు నాంది పలికిందని గుర్తు చేశారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోనే ప్రపంచంలో మొదటి ఐదు ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటిగా భార త్ నిలిచిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మధ్య ఆసియా సంక్షోభం వంటి సవాళ్లు ఎదురవుతున్నా అంచనాలను అధిగమించి ఎగుమ తులు పెంచామన్నారు.
ప్రపంచస్థాయి మార్కెట్లకు తెలంగాణ ఉత్పత్తులు
తెలంగాణ ఉత్పత్తులకు ప్రపంచస్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి పీయూష్ తెలిపారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. అత్యధిక ఎగుమతి సామర్థ్యం ఉన్న 50 ఉత్పత్తులు, సేవలను గుర్తించాలని చెప్పారు.
తెలంగాణలోని జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత గుర్తింపు వచ్చేలా నాణ్యమైన ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఉత్పత్తుల మూలాలను గుర్తించే ట్రేసబిలిటీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. తాండూరు కందిపప్పు, చపాటా మిర్చి, నిజామాబాద్ పసు పు వంటి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇటీవల తాండూరు ఎర్ర కందిపప్పు ఉత్పత్తులను హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతి చేయడం తెలంగాణ ఉత్పత్తులకు ఉన్న అవకాశాలకు నిదర్శనమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఫార్మా రంగానికి అధిక ప్రాధాన్యం..
ఫార్మా రంగంలో మరింత ఉన్నత స్థాయికి తెలంగాణ ఎదగాలని కేంద్రమంత్రి గోయ ల్ ఆకాంక్షించారు. జనరిక్ ఔషధాల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా, అధిక విలువ కలిగిన బ్రాండెడ్, వినూత్న ఔషధాలు, బయోసిమిలర్ల తయారీపై దృష్టి పెట్టాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అంతరిక్షం, విమా నయాన రంగాలు, విమాన విడిభాగాల తయారీ, నిర్వహణ-మరమ్మతు సేవలు(ఎంఆర్ఓ), రక్షణ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సహించాలని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ అభివృద్ధిని ప్రస్తావించారు. దీపావళి వేళ ఒక్కో దీపం వెలిగించడం ద్వారా వెలుగులు విస్తరించినట్లే.. ఒక్కో పెట్టుబడి, ఒక్కో ఎగుమతి, ఒక్కో కొత్త ఉద్యోగం, ఒక్కో స్టార్టప్ దేశాభివృద్ధికి దోహదపడతాయన్నారు. భారత్, తెలంగాణ భవి ష్యత్తు ఉమ్మడి కృషిపైనే ఆధారపడి ఉందన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదా రులు తెలంగాణలోని అవకాశాలను పరిశీలించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని ఆహ్వానించారు.ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావా లని ఆకాంక్షించారు.