పదవుల జాతర

22-10-2026 | 05:25am

దీపావళి నాటికి నామినేటెడ్ పోస్టుల భర్తీ!

  1. మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ సైతం..
  2. ఒకేసారి 80 కార్పొరేషన్ పోస్టుల భర్తీకి చాన్స్
  3. పదవీకాలం ముగిసినవాళ్లలో ఆరేడుగురికి మళ్లీ అవకాశం 
  4. ఎమ్మెల్సీలుగా ఇద్దరు బీసీలు.. అందులో ఒకరు పద్మశాలి!
  5. మరో ఎమ్మెల్సీ పదవి ఓసీ లేదా ఎస్సీకి

అక్టోబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల జాతర(A Gala of Nominated Posts) మొదలుకానుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నాయకులకు(Congress leaders') దీపావళి నాటికి తీపికబురు అందజేయాలని ఇటు ప్రభుత్వం, అటు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. కాలపరిమితి ముగిసిన కార్పొరేషన్లతోపాటు మొత్తం 80 పదవులను ఒకేసారి భర్తీ చేసేలా కార్యాచరణ కొనసాగుతున్నది.

అదేవిధంగా పీసీసీ కార్యవర్గం కూర్పు, గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీ పోస్టులు, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ వంటి పదవుల భర్తీపైనా కసరత్తు నడుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివా సంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశమై.. నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చిం చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేండ్లు దగ్గరకు వస్తున్నది. రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం.. కొన్ని ప్రధాన కార్పొరేషన్ల పోస్టులను భర్తీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేండ్ల్ల సమయమే ఉండటంతో.. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులన్నింటినీ భర్తీ చేసి, ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయాలని ఇటు ప్రభు త్వం, అటు పార్టీ ఆలోచన చేస్తున్నది.

నిజానికి నామినేటెడ్ పోస్టులన్నీంటిని త్వరలో భర్తీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. దసరా పండుగ ముందువరకే ఇది జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడు దీపావళి నాటికి పదవుల పందేరం జరుగుతుందని ప్రభుత్వం సూచనప్రాయంగా చెబుతున్నా, అది జరిగేదేనా అన్న నిరాశ ఆ పదవులను ఆశిస్తున్న వారిలో కలుగుతున్నది.

ఆరేడుగురు పాతవారికి!

ఇప్పుడు కార్పొరేషన్ పదవులతో పాటు పీసీసీ కార్యవర్గం కూర్పు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పదవుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టాయి. ఇప్పటికే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, పౌరసరఫరాల కార్పొరేషన్, మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్, డిప్యూటీ స్పీకర్,

ప్రభుత్వ చీఫ్ విప్ వంటి కీలక పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఈ పదవుల్లో కొందరు ఎమ్మెల్యేలకు, అదే స్థాయి నాయకులకు ఇవ్వాల్సి ఉండటంతో అధిష్ఠానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

అయితే ఇప్పటికే చర్చలు పూర్తయి జాబితా సిద్ధంగా ఉన్న నామినేటెడ్ పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో భర్తీ చేసిన 37 కార్పొరేషన్  పదవుల కాలపరిమితి ముగిసింది. వీటిలో ఎంతమందికి తిరిగి అవకాశం కల్పిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆరేడుగురికి మాత్రమే పదవులు తిరిగి ఇచ్చే అవకాశముంది.  

ఎమ్మెల్సీల్లో రెండు బీసీలకు!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో బీసీ సామాజికవర్గ నాయకులు, కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉందన్న విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్  తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది.   

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు ఆయన వివరించినట్లు సమాచారం. ఓటర్ల నమోదుకు పార్టీ తరఫున అందిస్తున్న సహకారం గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. పార్టీ పరంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరూ అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇక గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన మూడు ఎమ్మెల్సీ పదవులపైనా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు అవకాశం దక్కని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మూడు స్థానాల్లో ఒకటి పద్మశాలి సామాజిక వర్గానికి ఇవ్వనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు.

మిగిలిన రెండు స్థానాల్లో మరొకటి కూడా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇంకో స్థానంలో మహిళకు అవకాశం కల్పించాలా లేక బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలాన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగలకు ఈసారి మండలిలో అవకాశం ఇవ్వకపోతే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందనే చర్చ కూడా వచ్చినట్లు తెలిసింది.

అందుకు గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు మండలిలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని మాదిగ సామాజిక వర్గంతో పాటు మిగతా వర్గాలకు అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలపైనా..

పెండింగ్‌లో ఉన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకాలపైనా సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్  చర్చించినట్లు  సమాచారం. ఎలాంటి ఇబ్బందులు లేని నాయకులతో వర్కింగ్ ప్రెసిడెంట్  పదవులను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరాన్ని సీఎం గుర్తు చేసినట్లు తెలుస్తున్నది.

మొత్తంగా కార్పొరేషన్ పదవుల భర్తీ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకాలపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. 

మరిన్ని వార్తలు